
కౌలాలంపూర్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, మలేసియా బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు లీ చోంగ్ వీ క్యాన్సర్ బారిన పడ్డాడు. అతనికి ముక్కు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది ప్రాథమిక దశలోనే ఉందని మలేసియా బ్యాడ్మింటన్ సంఘం (బీఏఎమ్) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇటీవలి పరీక్షల అనంతరం లీ చోంగ్ వీకి ప్రాథమిక స్థాయిలో ముక్కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది’ అని బీఏఎమ్ అధ్యక్షుడు నోర్జా జకారియా తెలిపారు.
ప్రస్తుతం అతను తైవాన్‌లో చికిత్స తీసుకుంటున్నాడని... తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించారు. అతనికి అవసరమైన సాయం చేసేందుకు బీఏఎమ్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో మూడు సార్లు రజత పతకాలు గెలిచిన 35 ఏళ్ల లీ చోంగ్ వీ అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు.