సచిన్‌ను సగర్వంగా భుజాలపై...

Laureus Best Sporting Moment Award Won By Sachin Tendulkar - Sakshi

‘లారియస్‌ బెస్ట్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌’ అవార్డు సొంతం

అత్యుత్తమ క్షణంగా ‘క్యారీడ్‌ ఆన్‌ ద షోల్డర్స్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’

2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ తర్వాతి సంబరాలకు పురస్కారం

స్వయంగా అవార్డు అందుకున్న సచిన్‌ టెండూల్కర్‌

ఏప్రిల్‌ 2, 2011... భారత క్రికెట్‌ అభిమానులందరి గుండె ఆనందంతో ఉప్పొంగిన రోజు... 28 ఏళ్ల తర్వాత టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. నాడు విజేతగా నిలిచిన ఆ జట్టులో ఒక వ్యక్తి మాత్రం నిస్సందేహంగా అందరికంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా విజయం అందని ద్రాక్షగా మారిపోయిన వేళ ఆరో ప్రయత్నంలో జగజ్జేత జట్టులో భాగమైన ఆ వ్యక్తి సచిన్‌ టెండూల్కర్‌. తమకు పెద్దన్నయ్యలాంటి సచిన్‌ను భారత జట్టు సభ్యులందరూ తమ భుజాలపై మోసి మైదానంలో కలియతిరిగారు. ఇప్పుడు అదే ఘట్టానికి ప్రతిష్టాత్మక ‘లారియస్‌’ పురస్కారం దక్కింది.

బెర్లిన్‌: ‘సచిన్‌ టెండూల్కర్‌ ఇరవై ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోశాడు. ఇప్పుడు అతడిని మా భుజాలపై మోయడానికి మాకు ఇదే సరైన సమయం’... 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో విజయం అనంతరం విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. నాడు వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులే కాదు భారత జాతి మొత్తం ఆ క్షణాన్ని సగర్వంగా ఆస్వాదించింది. ఇప్పుడు అదే సంబరాలకు ప్రఖ్యాత క్రీడా పురస్కారం లభించింది. ‘లారియస్‌’ అవార్డుల్లో గత 20 ఏళ్లలో అత్యుత్తమ క్రీడా ఘట్టంగా ‘స్పోర్టింగ్‌ మూమెంట్‌’ అవార్డు లభించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా, మాజీ టెన్నిస్‌ స్టార్‌ బోరిస్‌ బెకర్‌ చేతుల మీదుగా స్వయంగా సచిన్‌ టెండూల్కర్‌ ఈ అవార్డును అందుకున్నాడు. రెండు దశాబ్దాల ‘లారియస్‌ క్రీడా పురస్కారాల చరిత్ర’లో భారత్‌ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా ఓటింగ్‌తో...

గత ఇరవై ఏళ్లలో (2000–2020) ఇరవై అత్యుత్తమ క్రీడా ఘట్టాలను ‘లారియస్‌’ ముందుగా ఎంపిక చేసింది. మూడు రౌండ్ల ద్వారా విజేతను తేల్చారు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 16 మధ్య ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు దీనికి ఓటింగ్‌ చేసే అవకాశం కల్పించగా... జాబితాను ముందుగా టాప్‌–10కు, ఆ తర్వాత టాప్‌–5కు కుదించి చివరకు అత్యుత్తమ క్షణాన్ని ప్రకటించారు. ఫైనల్‌ రౌండ్‌లో మిగిలిన నాలుగు నామినేషన్లను వెనక్కి నెట్టిన ‘క్యారీడ్‌ ఆన్‌ ద షోల్డర్స్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’కు అవార్డు దక్కింది. ఈ అవార్డుకు సాధారణ మ్యాచ్‌ల ఫలితాలు, స్కోర్లు తదితర అంశాలతో సంబంధం లేకుండా ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన ఘట్టాలనే ఎంపిక చేసి నామినేట్‌ చేశారు.

ప్రపంచ కప్‌ గెలిచిన అనుభూతి అద్భుతం. దానిని మాటల్లో వర్ణించలేను. రెండో మాటకు తావు లేకుండా అందరూ ఒక తరహా భావనతో ఉండే ఘట్టాలు చాలా అరుదు. దేశం మొత్తం ఒకేసారి సంబరాలు చేసుకోవడం అలాంటిదే. క్రీడలు ఎంత గొప్పవో, అవి మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ క్షణాలను చూస్తూ నేను తన్మయత్వానికి లోనవుతాను. 1983లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ గెలిచినప్పుడు పదేళ్ల వయసులో నా క్రికెట్‌ ప్రస్థానం మొదలైంది. ఆ గెలుపు ప్రత్యేకత ఏమిటో నాకు అప్పుడు తెలీదు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి నేనూ భాగమయ్యాను.

అయితే దీనికి ఏదో విశేషం ఉందని, నేను కూడా అలాంటి అనుభూతిని పొందాలని మాత్రం అనిపించింది. 22 ఏళ్లు వేచి చూసిన తర్వాత ట్రోఫీని అందుకోవడం నేనెప్పటికీ గర్వపడే క్షణం. నా దేశ ప్రజల తరఫున ఆ ట్రోఫీని పట్టుకున్నట్లు భావించాను. నాపై నెల్సన్‌ మండేలా ప్రభావం ఉంది. ఆయన పడిన కష్టాలు నాయకుడిగా ఎదగడంలో అడ్డు రాలేదు. మండేలా చెప్పిన ఎన్నో గొప్ప మాటల్లో క్రీడలకు ప్రతీ ఒక్కరినీ కలిపే శక్తి ఉందని చెప్పిన మాట నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు ఎంతో మంది గొప్ప అథ్లెట్లతో కలిసి కూర్చున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా అన్నీ అధిగమించి విజయాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినవారందరికీ నా కృతజ్ఞతలు. ఈ ట్రోఫీ నా ఒక్కడిదే కాదు, మన అందరిదీ కూడా. –పురస్కారం స్వీకరించిన అనంతరం సచిన్‌ ప్రసంగం

అవార్డు గెలుచుకోకపోయినా ‘సచిన్‌ క్షణం’తో పోటీ పడిన మిగిలిన నాలుగు నామినేషన్లను చూస్తే...

దక్షిణాఫ్రికాకు చెందిన స్విమ్మర్‌ నటాలీ డు టొయిట్‌ 14 ఏళ్ల వయసులో కామన్వెల్త్‌ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలు పోగొట్టుకుంది. అయితే పట్టుదలగా పోరాడిన నటాలీ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు ఓపెన్‌ విభాగంలో (వికలాంగుల పారాలింపిక్స్‌లో కాకుండా) అర్హత పొందింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఏడుసార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌గా నిలిచిన విఖ్యాత రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ బాటలోనే అతని కొడుకు మిక్‌ కూడా రేసింగ్‌లోకి అడుగు పెట్టాడు. 2004లో జర్మన్‌ గ్రాండ్‌ప్రిలో షుమాకర్‌ విజేతగా నిలబడిన హోకెన్‌హీమ్‌ వేదిక వద్దే 15 ఏళ్ల తర్వాత నాటి కారులోనే మిక్‌ రేసింగ్‌ చేయడం ఎఫ్‌1 అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.

2016 కోపా సుడ్‌ అమెరికానా ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో ‘కాపికోన్స్‌’ టీమ్‌ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. 77 మందిలో 71 మంది చనిపోగా... మిగిలిన ఆరుగురిలో ముగ్గురు ఆ జట్టు ఆటగాళ్లు ఉన్నారు. ఆ తర్వాత 50 వేల మంది పాల్గొన్న స్మారక సభలో ప్రత్యర్థి జట్టు అట్లెటికో నకోనియల్‌ టైటిల్‌ను ‘కాపికోన్స్‌’కు అందజేస్తున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్లకు జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఆ ముగ్గురు ఆటగాళ్లు ఫాల్‌మన్, రషెల్, నెటో కన్నీళ్లపర్యంతమవుతూ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ప్రేమికులను ఆ ఘటన కలచివేసింది.

చైనాకు చెందిన జియా బోయు 1975లో తొలిసారి ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కే క్రమంలో విఫలమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించాలని భావిస్తే క్యాన్సర్‌ కారణంగా అతని రెండు కాళ్లు తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరిన్ని సార్లు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే 2018లో ఎట్టకేలకు 69 ఏళ్ల వయసులో బోయు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాడు. రెండు కాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ఎవరెస్ట్‌ను ఎక్కిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

లారియస్‌ ఇతర అవార్డుల విజేతల వివరాలు  
►స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: లూయిస్‌ హామిల్టన్‌ (ఫార్ములావన్‌–బ్రిటన్‌), లయోనల్‌ మెస్సీ (ఫుట్‌బాల్‌–అర్జెంటీనా) 
►స్పోర్ట్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌–అమెరికా) 
►వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు 
►వరల్డ్‌ బ్రేక్‌ త్రూ ఆఫ్‌ ద ఇయర్‌: ఎగాన్‌ బెర్నాల్‌ (సైక్లింగ్‌–కొలంబియా) 
►వరల్డ్‌ కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సోఫియా ఫ్లోర్‌ష్‌ (రేసింగ్‌–జర్మనీ) 
►స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ విత్‌ డిస్‌ఎబిలిటీ: ఒక్సానా మాస్టర్స్‌ (పారా రోయింగ్‌–అమెరికా) 
►యాక్షన్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: కోయి కిమ్‌ (స్నో బోర్డింగ్‌–అమెరికా) 
►స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌: సౌత్‌ బ్రాంక్స్‌ యునైటెడ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌: డర్క్‌ నొవిట్జీ (బాస్కెట్‌బాల్‌–జర్మనీ) 
►అకాడమీ ఎక్సెప్షనల్‌ అచీవ్‌మెంట్‌: స్పానిష్‌ బాస్కెట్‌బాల్‌ ఫెడరేషన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top