కుశాల్ కౌశ‌లం

Kusal Perera heroics lead Sri Lanka to remarkable Test win in South Africa - Sakshi

అజేయ శతకంతో లంకను గెలిపించిన బ్యాట్స్‌మన్‌

నాలుగో ఇన్నింగ్స్‌లో 304 పరుగుల లక్ష్య ఛేదన

తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం

ఇంటాబయట ఓటములు... ఆటగాళ్ల దారుణ వైఫల్యాలు... కొరవడిన సమష్టి ప్రదర్శన... వెరసి కొన్నేళ్లుగా పతనమవుతున్న శ్రీలంక క్రికెట్‌కు పునరుత్తేజం కలిగించే గెలుపు లభించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ పెరీరా మహాద్భుతం అనదగ్గ పోరాటంతో అజేయ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో లంక అసాధారణ విజయం నమోదు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో స్టెయిన్, రబడ, ఒలివియర్‌లాంటి సఫారీ పేసర్లకు ఎదురొడ్డిన కుశాల్‌... దూకుడు, సంయమనం కలగలిసిన బ్యాటింగ్‌తో జట్టుకు మరుపురాని గెలుపును అందించాడు. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి పదో వికెట్‌కు విశ్వ ఫెర్నాండోతో కలిసి రికార్డు స్థాయిలో అభేద్యంగా 78 పరుగులు జోడించి అద్వితీయ విజయాన్ని ఖాయం చేశాడు. 

డర్బన్‌: విజయ లక్ష్యం 304 పరుగులు. ఓవర్‌నైట్‌ స్కోరు 83/3. శనివారం ఆట మొదలైన కాసేపటికే మరో రెండు వికెట్ల పతనం. పరిస్థితి 110/5..! ఎదురుగా దక్షిణాఫ్రికా భీకర పేసర్లు. ఏ విధంగా చూసినా పరాజయం ఖాయమనిపించే ఇలాంటి దశ నుంచి కుశాల్‌ పెరీరా (200 బంతుల్లో 153 నాటౌట్‌; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) శ్రీలంకను ఒంటిచేత్తో గెలిపించాడు. అతడి వీరోచిత ఇన్నింగ్స్‌కు తొలుత ఆల్‌రౌండర్‌ ధనంజయ డిసిల్వా (79 బంతుల్లో 48; 6 ఫోర్లు); చివర్లో పేసర్‌ విశ్వ ఫెర్నాండో (27 బంతుల్లో 6 నాటౌట్‌) అండగా నిలవడంతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో సఫారీలపై లంక ఒక వికెట్‌ తేడాతో ఊహించని రీతిలో గెలుపొందింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1–0 ఆధిక్యం సాధించింది. ఈ నెల 21 నుంచి రెండో టెస్టు పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరుగుతుంది. 

226/9 నుంచి 304/9కు... 
చేతిలో ఉన్న ఏడు వికెట్లతో విజయానికి 221 పరుగులు చేయాల్సిన స్థితిలో శనివారం బ్యాటింగ్‌కు దిగిన లంకను స్టెయిన్‌ (2/71) బెంబేలెత్తించాడు. రెండు బంతుల వ్యవధిలో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఒషాదా ఫెర్నాండో (37), వికెట్‌ కీపర్‌ డిక్‌వెల్లా (0)లను ఔట్‌ చేశాడు. 110/5తో నిలిచిన లంకను ఆరో వికెట్‌కు 96 పరుగులు జోడించి కుశాల్, ధనంజయ ఆదుకున్నారు. ఓ దశలో 206/5తో ఆతిథ్య జట్టు ఆశావహంగా కనిపించింది. అయితే, స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (3/71) వరుస బంతుల్లో ధనంజయ, లక్మల్‌ (0)లను కాసేపటికి రజిత (1)ను పెవిలియన్‌ పంపాడు. మధ్యలో లసిత్‌ ఎంబుల్‌దేనియా (4) వికెట్‌ను ఒలివియర్‌ పడగొట్టాడు. 226/9తో ఓటమి కొనకు చేరిన లంకను పదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించి కుశాల్, విశ్వ ఫెర్నాండో గెలిపించారు.  

ఔరా కుశాల్‌... 
లంక రికార్డు పదో వికెట్‌ భాగస్వామ్యంలో కుశాల్‌ పెరీరా ఆటే హైలైట్‌. జట్టు 9వ వికెట్‌ పడినప్పుడు 86 పరుగులతో ఉన్న అతడు... ఇక తాడోపేడో అన్నట్లు ఆడాడు. సెంచరీ తర్వాత మరింత చెలరేగాడు.స్టెయిన్, రబడ వంటి బౌలర్లను లెక్కచేయకుండా వారి ఓవర్లలో ఐదు సిక్స్‌లు బాదాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ ఫీల్డర్లను బౌండరీల వద్ద మోహరించాడు. అయినా కుశాల్‌ ఏమాత్రం తగ్గలేదు. ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి స్ట్రయిక్‌ కాపాడుకుంటూ సమయస్ఫూర్తి చూపాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో 68 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో 27 బంతులను కాచుకుని విశ్వ ఫెర్నాండో అతడికి సంపూర్ణ సహకారం అందించాడు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా ఓవర్‌త్రో రూపంలో 4 పరుగులు ఇవ్వడం కూడా లంకకు మేలు చేసింది. కుశాల్‌ పెరీరాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. 

►పరుగులు 153
►బంతులు200
►ఫోర్లు 12
►సిక్సర్లు 5 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top