
వెల్లింగ్టన్: విదేశీ గడ్డపై భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కే తన ఓటని జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. కుల్దీప్ ఇప్పటికే అశ్విన్, జడేజాలను దాటి భారత నంబర్‌వన్ స్పిన్నర్‌గా ఎదిగాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై కుల్దీప్ ఐదు వికెట్లు తీశాడని కోచ్ గుర్తు చేశారు. ‘విదేశీ గడ్డపై టెస్టు ఆడటమే తరువాయి అతను ఐదు వికెట్లతో చెలరేగాడు. కాబట్టి విదేశాల్లో జట్టు ప్రధాన స్పిన్నర్‌గా స్థానం ఖాయమైంది. సిడ్నీలో అతని ప్రదర్శన నన్ను ఎంతో ఆకట్టుకుంది. గతంలో అశ్విన్ తదితరులకూ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మా నంబర్‌వన్ స్పిన్నర్ కుల్దీపే.
విదేశాల్లో భారత్ ఒకే స్పిన్నర్‌తో ఆడాల్సి వస్తే అది కచ్చితంగా కుల్దీపే అవుతాడు’ అని శాస్త్రి ప్రశంసలతో ముంచెత్తారు. మరో వైపు ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టునుంచి పుజారాను తప్పించడం అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనని కోచ్ స్పష్టం చేశారు. అతను క్రీజ్‌లో నిలబడే విషయంలో చిన్నపాటి సమస్య కనిపించిందని, దానిని సరిదిద్దకుండా ఆడిస్తే తర్వాత 7–8 టెస్టుల పాటు అదే ఇబ్బందికరంగా మారేదన్న కోచ్... ఆ సమస్యను అధిగమించేందుకు తగిన సమయం ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించిన శాస్త్రి...అతడిని నాటి దిగ్గజాలు రిచర్డ్స్, ఇమ్రాన్ ఖాన్‌లతో పోల్చారు.