ఇది కచ్చితంగా ప్రత్యేకం: కోహ్లి

Kohli Praises De Villiers on Special Partnership - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: డూ ఆర్‌ డై స్థితిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయంతో ప్లే ఆఫ్‌ అవకాశాలను నిలుపుకుంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. కోహ్లి-డివిలియర్స్‌ భాగస్వామ్యం(118 పరుగులు)తో శనివారం ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో పరుగుల వరద పారింది. మరో ఓవర్‌ మిగిలి ఉండగానే డీడీపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ను డివిలియర్స్‌కు కట్టబెట్టాడు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. 

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌ అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి డివిలియర్స్‌తో ఉన్న ఓ ఫోటోను ఉంచాడు. ‘ఇతనితో(డివిలియర్స్‌) బ్యాటింగ్‌ చేయటాన్ని ఆస్వాదిస్తాను. అవతలి ఎండ్‌లో ఇతగాడు ఉంటే పని చాలా సులువైపోతుంది. ఈరోజు విజయతీరాలకు చేర్చిన మరో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాం’ అంటూ డివిలియర్స్‌పై కోహ్లి పొగడ్తలు గుప్పించాడు. డేర్‌ డెవిల్స్‌ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (37 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కోహ్లి (40 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. 

గౌరవంగా భావిస్తా... ఇక మ్యాచ్‌ అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడుతూ... ‘ఏబీతో కలిసి క్రీజులో ఉండటం గౌరవంగా భావిస్తాను. అతనో అద్భుతమైన ఆటగాడు. నెట్‌ రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని మేం వేగంగా మ్యాచ్‌ను ముగించాలనుకున్నాం. కానీ, పాయింట్లు కీలకం. మనం గెలిచి తీరతామని ఏబీ నాతో అన్నాడు. అందుకే చివర్లో నిదానంగా ఆడాం. మేం నెలకొల్పిన భాగస్వామ్యంలో ఇది కచ్చితంగా ప్రత్యేకం’ అని కోహ్లి తెలిపాడు. కాగా, ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన ఆర్సీబీకి ఇది నాలుగో విజయం మాత్రమే. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లే ఆఫ్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్సీబీ, ప్లే ఆఫ్‌కి చేరుకోవాలంటే మిగతా మ్యాచ్‌లు తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు నెట్‌ రన్‌రేట్‌ కూడా పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top