వివాదానికి ముందు... వివాదానికి తరువాత...

KL Rahul returns to international cricket after Kofee With Karan controversy - Sakshi

టీవీ టాక్‌ షోలో వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత లోకేశ్‌ రాహుల్‌పై నిషేధం పడింది. అయితే పాండ్యాతో పోలిస్తే అతనిపై అన్ని వైపుల నుంచి సానుభూతి వ్యక్తమైంది. రాహుల్‌ తన మాటల్లో మరీ హద్దు మీరలేదని, కేవలం పాండ్యాతో కలిసి పాల్గొనడం వల్లే ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడని చాలా మంది వ్యాఖ్యానించారు. అనవసరంగా అతడి కెరీర్‌ ప్రమాదంలో పడిందని కూడా అనుకున్నారు. రాహుల్‌లో అపార ప్రతిభ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్‌ కప్‌ కోణంలో చూస్తే బ్యాకప్‌ ఓపెనర్‌గా పనికి రావడంతో పాటు ఏ స్థానంలోనైనా ఆడగల సామర్థ్యం ఉంది. ధాటిగా పరుగులు చేయగల సత్తా కూడా ఉంది.ఇదే కారణంగా సెలక్టర్లు అతడికి ఆస్ట్రేలియాతో సిరీస్‌ రూపంలో మరో అవకాశం ఇచ్చారు. దాదాపు వరల్డ్‌ కప్‌ జట్టు ఇదేనని వినిపిస్తున్నా... విఫలమైతే మళ్లీ వేటు పడేలా ఉన్న స్థితిలో రాహుల్‌ మెరిశాడు. నిజానికి టాక్‌ షో వివాదం ఒక రకంగా రాహుల్‌కు మేలే చేసింది. నిషేధం ఎత్తివేయగానే తర్వాతి సిరీస్‌ కోసం అతని పేరును సెలక్టర్లు పరిశీలించారు. వాస్తవంగా చెప్పాలంటే నిషేధం ముందు వరకు అతని ఆట ఏమీ బాగా లేదు. ఓవల్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత సెంచరీ అనంతరం అతను ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై అర్ధసెంచరీ చేశాడు.

అంతే... ఆ తర్వాత ఆట గతి తప్పింది. టెస్టులు, టి20ల్లో కలిపి 13 ఇన్నింగ్స్‌లు ఆడితే వరుసగా 0, 4, 33 నాటౌట్, 16, 26 నాటౌట్, 17, 13, 14, 2, 44, 2, 0, 9 మాత్రమే. ఇందులో ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ కాదు. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న స్థితిలో సిడ్నీ టెస్టు తర్వాత చోటు సందేహంగానే కనిపించింది. ఈ స్థితిలో టీవీ షో వివాదం వచ్చింది. ఇండియా ఎ తరఫున కూడా మూడు వన్డేల్లో 13, 42, 0 పరుగులే చేశాడు. అయితే అనధికారిక టెస్టులో మాత్రం రెండు అర్ధసెంచరీలు సాధించాడు. అతనిపై నమ్మకంతో మళ్లీ ఎంపిక చేసేందుకు ఈ రెండు ఇన్నింగ్స్‌లు సరిపోయాయి. విశాఖ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి మధ్య రాహుల్‌ బరిలోకి దిగాడు. అయితే స్వేచ్ఛగా, తనదైన శైలిలో ఆడాడు. పైగా మరో బ్యాట్స్‌మెన్‌ ఎవరూ కూడా సాధారణ ప్రదర్శన ఇవ్వకపోవడంతో అతని అర్ధసెంచరీ హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ ఆసాంతం అతని షాట్లలో తడబాటు లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. జంపా బౌలింగ్‌లో ముందుకొచ్చి కొట్టిన చూడచక్కటి స్ట్రెయిట్‌ సిక్సర్‌ దానిని చూపించింది. జట్టు మేనేజ్‌మెంట్‌ అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా రాహుల్‌ ఆట సాగింది. తుది నిర్ణయం కాకపోయినా వరల్డ్‌ కప్‌ రేసులో తనతో పోటీ పడుతున్నవారితో పోలిస్తే వారిని వెనక్కి తోసేలా రాహుల్‌ ఆడాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top