అయ్యో...శ్రీకాంత్‌!

Kidambi Srikanth Loses In Semifinals Of Hong Kong Open  - Sakshi

హాంకాంగ్‌ ఓపెన్‌ సెమీస్‌లో ఓడిన భారత స్టార్‌ షట్లర్‌

రెండో గేమ్‌లో ఏడు గేమ్‌ పాయింట్లను చేజార్చుకున్న మాజీ నంబర్‌వన్‌

హాంకాంగ్‌: తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) నుంచి వాకోవర్‌ లభించడం... కీలక క్వార్టర్‌ ఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) గాయంతో వైదొలగడం... వెరసి ఎనిమిది నెలల తర్వాత ఓ టోర్నీ లో సెమీఫైనల్‌ చేరే అవకాశం దక్కించుకున్న భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ భారంగా నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 9–21, 23–25తో ప్రపంచ 27వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

తొలి గేమ్‌లోనైతే పూర్తిగా గతి తప్పిన అతను రెండో గేమ్‌లో తేరుకున్నాడు. నిలకడగా ఆడుతూ ఒకదశలో 20–15తో ఐదు గేమ్‌ పాయింట్లను సంపాదించాడు. మరో పాయింట్‌ గెలిస్తే మ్యాచ్‌లో నిలిచే స్థితిలో తీవ్ర ఒత్తిడికి లోనైన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకున్నాడు. స్కోరు 20–20తో సమమైన దశలో శ్రీకాంత్‌ మళ్లీ పాయింట్‌ గెలిచి 21–20తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 21–21తో స్కోరు మళ్లీ సమమయ్యాక శ్రీకాంత్‌ మరో పాయింట్‌ గెలిచి 22–21తో ఏడోసారి గేమ్‌ పాయింట్‌ సంపాదించాడు. అయితే లీ చెయుక్‌ పట్టుదలతో పోరాడి స్కోరును 22–22తో, ఆ తర్వాత 23–23తో సమం చేశాడు. ఈ దశలో లీ చెయుక్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు.

సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,420 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది 14 టోర్నమెంట్‌లలో పాల్గొన్న శ్రీకాంత్‌... ఐదు టోరీ్నల్లో క్వార్టర్‌ ఫైనల్‌కు, మూడు టోరీ్నల్లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు, ఒక టోరీ్నలో ఫైనల్‌కు, మరో టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరుకొని నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్‌లో ని్రష్కమించాడు. ఈ సీజన్‌లో మరో రెండు టోరీ్నలకు శ్రీకాంత్‌ ఎంట్రీలను పంపించాడు. ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే కొరియా మాస్టర్స్‌ టోర్నీలో, ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 1 వరకు జరిగే సయ్యద్‌ మోడీ టోర్నమెంట్‌లో కిడాంబి శ్రీకాంత్‌ బరిలోకి దిగుతాడు.   

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top