ఖాజా సెంచరీ.. ఆసీస్‌ భారీ స్కోరు

Khawaja Century Helps Australia to 313 Runs Against India - Sakshi

రాంచీ: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 314 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ఉస్మాన్‌ ఖాజా-అరోన్‌ ఫించ్‌లు ధాటిగా ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత ఫించ్‌(93; 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. అటు తర్వాత మ్యాక్స్‌వెల్-ఖాజాల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే ఖాజా(104; 113 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఇది ఖాజాకు తొలి వన్డే సెంచరీ. అయితే శతకం పూర్తి చేసుకున్న ఖాజా పెవిలియన్‌ చేరాడు. (అమర జవాన్లకు టీమిండియా ఘన నివాళి)

ఇక‍్కడ 24 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ నాలుగు వికెట్లను చేజార్చుకోవడంతో స్కోరులో వేగం తగ్గింది. ఖాజా ఔటైన స్వల్ప వ్యవధిలో మ్యాక్స్‌వెల్‌(47; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షాన్‌ మార్ష్‌(7), హ్యాండ్స్‌ కోంబ్‌(0)లు పెవిలియన్‌ చేరారు.  ఇక చివర్లో స్టోయినిస్‌( 31 నాటౌట్‌), క్యారీ( 21 నాటౌట్‌)లు సమయోచితంగా ఆడటంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్‌ షమీ వికెట్‌ తీశాడు.

చెలరేగిన ఫించ్‌..
చాలా కాలం తర్వాత ఫించ్‌ చెలరేగి ఆడాడు. తొలుత కుదురుగా ఆడిన ఫించ్‌.. ఆపై విజృంభించాడు. క్రీజ్‌లో కుదురుకున్న తర్వాత ఫించ్‌ బౌండరీలే లక్ష్యంగా తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. ఈ క్రమంలోనే  51 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. ఇది ఫించ్‌కు 19వ వన్డే ఫిఫ్టీ. అయితే వైట్‌ బాల్‌ క్రికెట్‌ పరంగా చూస్తే గతేడాది జూలై తర్వాత ఫించ్‌కు ఇది తొలి హాఫ్‌ సెంచరీ. ఓవరాల్‌గా చూస్తే తొమ్మిది ఇన్నింగ్స్‌ల తర్వాత ఫించ్‌ మొదటి అర్థ శతకం సాధించాడు.

ధావన్‌ వదిలేశాడు.. ఖాజా బాదేశాడు..
ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫీల్డింగ్‌ పేలవంగా సాగింది. ప్రధానంగా ఓపెనర్‌ ఖాజా ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ధావన్‌ జారవిడిచాడు. జడేజా వేసిన ఏడో ఓవర్‌ నాల్గో బంతికి ఖాజా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ బంతిని ఖాజా రివర్స్‌ స్వీప్‌ ఆడగా అది బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న ధావన్‌ చేతుల్లో పడింది. అయితే ఆ సునాయాసమైన క్యాచ్‌ను ధావన్‌ వదిలేయడంతో ఖాజాకు లైఫ్‌ లభించింది. అంతకుముందు బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతి ఎడ్జ్‌ తీసుకుని ఫోర్‌కు పోయింది. ఆ సమయంలో స్లిప్‌లో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడం ఖాజాకు కలిసొచ్చింది. ఈ రెండింటిని సద్వినియోగం చేసుకున్న ఖాజా సెంచరీ సాధించి తన వికెట్‌ ఎంత విలువైందో శతకంతో నిరూపించాడు.

ఇక్కడ చదవండి: ఆసీస్‌కు ఇది మూడోది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top