‘వారే నాకు స్ఫూర్తి, ధైర్యం’: టీమిండియా క్రికెటర్‌

Khaleel Ahmed Aims To Emulate Idol Zaheer Khan - Sakshi

క్రికెట్లో లెఫ్టార్మ్‌ పేసర్ల పాత్ర ఎంతో కీలకం. సర్ గార్ఫీల్డ్ సోబర్స్, వసీం ఆక్మమ్‌, చమింద వాస్‌, జహీర్‌ ఖాన్‌ ఇలా ఎంతో మంది లెఫ్టార్మ్‌ బౌలర్లు సుదీర్ఘ కాలం వారి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. జహీర్‌ ఖాన్‌, అశిష్‌ నెహ్రాలు రిటైర్మెంట్‌ అనంతరం టీమిండియాలో లెఫ్టార్మ్‌ పేసర్‌ స్థానం ఖాళీ అయింది. బరిందర్‌ శ్రాన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, అంకిత్‌ చౌదరీలు జట్టులోకి వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. ఒకానొక సమయంలో బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ టీమిండియాకు లెఫ్టాండ్‌ బౌలర్‌ ఎంతో అవసరమని సెలక్టర్లకు విన్నవించుకున్నాడు. ఈ తరుణంలో సెలక్లర్లను ఆకట్టుకుంటూ జట్టులోకి వచ్చాడు రాజస్తాన్‌ ఆటగాడు ఖలీల్‌ అహ్మద్‌. మరి ఆసియా కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడా లేక అలా వచ్చి ఇలా వెళ్లి పోతాడా వేచిచూడాలి.

సాక్షి, స్కోర్స్ట్‌: టీమిండియాకు ఆడాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు.. కానీ కొందరు మాత్రమే సుసాధ్యం చేసుకుంటారు. కన్న కలను సాకారం చేసుకొని రోహిత్ శర్మ నేతృత్వంలో ఆసియా కప్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్నాడు రాజస్తాన్‌ ఆటగాడు ఖలీల్‌ అహ్మద్‌. టీమిండియా మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ తనకు ఆదర్శమని, అండర్‌ -19, భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచారని ఈ యువ క్రికెటర్‌ వివరించారు. ప్రస్తుతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో ఆడే అవకాశం వస్తే తానేంటో నిరూపించుకుంటానని స్పష్టంచేశాడు. భారత్‌ ‘ఏ’తరుపున 17 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్‌ 28 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఏ, దక్షిణాఫ్రికా ఏ లపై చేసిన అత్యత్తమ ప్రదర్శనతోనే టీమిండియా తరుపున ఆడే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డాడు. 

జహీర్‌ భాయ్‌ చెప్పినవన్నీ డైరీలో నోట్‌ చేసుకున్నా..

‘2016లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడటం నాకు ఎంతో లాభించింది. నా స్పూర్తి జహీర్‌ ఖాన్‌. అతడిలా గొప్ప బౌలర్‌ కావాలని కలలు కన్నాను. ఈ దిగ్గజ ఆటగాడు చెప్పిన ప్రతీ సలహా, సూచన డైరీలో నోట్‌ చేసుకున్నా. నాకు ఏ సందేహం వచ్చినా ధైర్యంగా అడిగేవాడిని. యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియాకప్‌లో కూడా ఎలా ఆడాలో అతడి సూచనలు డైరీలో నోట్‌ చేసుకుంటాను. అందరూ నన్ను మరో జహీర్‌ అంటున్నారు. జహీర్‌ లెజెండ్‌ క్రికెటర్‌. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఒకరు స్థానాన్ని నేను భర్తీ చేయడమేంటి? తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాను. జహీర్‌ ఖాన్‌ కంటే ఎక్కువ వికెట్లు తీస్తాను(నవ్వుకుంటూ)’ అంటూ ఖలీల్‌ పేర్కొన్నాడు. 

ద్రవిడ్‌ అంటే ధైర్యం

‘గెలుపోటముల గురించి ఆలోచించకు, నీ ఆట నువ్వు ఆడు’ అంటూ రాహుల్‌ ద్రవిడ్‌ ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఈ యువ ఆటగాడు తెలిపాడు. ద్రవిడ్‌ పక్కనుంటే ఎంతో ధైర్యంగా ఆడతామని, ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడని వివరించాడు. వందశాతం కష్టపడతానని, భారత్‌ తరుపున్న ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నాడు. ఆసియాకప్‌కు ఎంపిక కావడం పట్ల తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top