మొమోటా మ్యాజిక్‌...

Kento Momota Wins 11th Title of 2019 - Sakshi

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలోనూ విజేత

ఈ ఏడాది 11వ సింగిల్స్‌ టైటిల్‌తో కొత్త రికార్డు

ఈ సంవత్సరం మొమోటా చైనా మాస్టర్స్, డెన్మార్క్‌ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ జపాన్‌ ఓపెన్, ఆసియా చాంపియన్‌íÙప్, సింగపూర్‌ ఓపెన్, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్, జర్మన్‌ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు. 

గ్వాంగ్‌జౌ (చైనా): తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) 2019 సీజన్‌ను టైటిల్‌తో ముగించాడు. సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మొమోటా విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మొమోటా 87 నిమిషాల్లో 17–21, 21–17, 21–14తో ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. ఈ ఏడాది మొమోటా 12 టోరీ్నల్లో ఫైనల్స్‌ చేరగా... 11 టోర్నీల్లో టైటిల్స్‌ సాధించాడు. తద్వారా బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే ఏడాది అత్యధికంగా 11 టైటిల్స్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు లీ చోంగ్‌ వీ (మలేసియా), వాంగ్‌ జియోలి–యు యాంగ్‌ (చైనా) జంట పేరిట ఉండేది. 2010లో లీ చోంగ్‌ వీ సింగిల్స్‌ విభాగంలో 10 టైటిల్స్‌ నెగ్గగా... 2011లో వాంగ్‌ జియోలి–యు యాంగ్‌ జోడీ మహిళల డబుల్స్‌ విభాగంలో 10 టైటిల్స్‌ సాధించింది.

జిన్‌టింగ్‌తో జరిగిన ఫైనల్లో మొమోటా అద్భుతమే చేశాడు. తొలి గేమ్‌ కోల్పోయిన ఈ జపాన్‌ స్టార్‌ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 5–12తో ఏడు పాయింట్లతో వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ టోర్నీకంటే ముందు తాను ఆడిన నాలుగు టోర్నీల ఫైనల్స్‌లోనూ ఓడిపోయిన జిన్‌టింగ్‌ కీలకదశలో ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన మొమోటా స్కోరును 12–12తో సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 15–14 వద్ద మొమోటా ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకున్నాడు. దాంతో జిన్‌టింగ్‌ ఈ ఏడాది ఆడిన ఐదు టోరీ్నల ఫైనల్స్‌లో ఓటమిని మూటగట్టుకున్నాడు. చాంపియన్‌ మొమోటాకు లక్షా 20 వేల డాలర్లు (రూ. 84 లక్షల 83 వేలు), రన్నరప్‌ జిన్‌టింగ్‌కు 60 వేల డాలర్లు (రూ. 42 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top