కశ్యప్ శుభారంభం | Sakshi
Sakshi News home page

కశ్యప్ శుభారంభం

Published Wed, Apr 22 2015 1:20 AM

Kashyap good started

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

వుహాన్ (చైనా) : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో భారత స్టార్ పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కశ్యప్ 21-17, 21-13తో జిలియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్నా కశ్యప్‌కు రెండో గేమ్‌లో ఎదురులేకుండా పోయింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ 9-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరుతో మ్యాచ్‌ను ముగించాడు. బుధవారం జరిగే తదుపరి రౌండ్‌లో జెన్ హావో సు (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు.

ముఖాముఖి రికార్డులో కశ్యప్ 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో జెన్ హావో సు చేతిలో ఓడిన కశ్యప్ ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి. మరోవైపు మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. జ్వాల-అశ్విని జంట 17-21, 21-15, 15-21తో యు పో పాయ్-యా చింగ్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement