చాంపియన్‌ కర్ణాటక 

Karnataka has a strong victory over Maharashtra - Sakshi

ముస్తాక్‌ అలీ ట్రోఫీ కైవసం

 ఫైనల్లో మహారాష్ట్రపై ఘన విజయం 

చెలరేగిన మయాంక్‌ అగర్వాల్‌  

ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర, కర్ణాటక జట్లు ఫైనల్‌ దాకా అజేయమైన ఫలితాల్ని సాధించాయి. చివరకు ఫైనల్‌ ముగిసేదాకా అజేయంగా నిలిచింది మాత్రం కర్ణాటక. సమవుజ్జీల మధ్య జరిగిన అంతిమ సమరంలో కర్ణాటక జయభేరి మోగించి టి20 జాతీయ చాంపియ గా నిలిచింది. 

ఇండోర్‌: మయాంక్‌ అగర్వాల్‌ (57 బంతుల్లో 85 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో కర్ణాటకకు ముస్తాక్‌ అలీ ట్రోఫీని అందించాడు. గురువారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషాద్‌ షేక్‌ (41 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. కర్ణాటక బౌలర్‌ మిథున్(2/24) మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. తర్వాత కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి గెలిచింది. రోహ కదమ్‌ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. మయాంక్‌కు ‘మ్యాన్  ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
 
రాణించిన నౌషాద్‌ 
టాస్‌ నెగ్గిన కర్ణాటక బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్రకు రాహుల్‌ త్రిపాఠి (30; 3 ఫోర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (12) ఓ మోస్తరు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరితో పాటు విజయ్‌ జోల్‌ (8) కూడా ఔట్‌ కావడంతో మహారాష్ట్ర రన్రేట్‌ 10 ఓవర్లదాకా ఆరు పరుగులను మించలేకపోయింది. నౌషద్‌ షేక్‌ ధాటిగా ఆడటంతో ఆ తర్వాత మహారాష్ట్ర స్కోరులో వేగం పుంజుకుంది. అతను అంకిత్‌ బావ్నే (29; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. చివరిదాకా క్రీజులో ఉండి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. కరియప్ప, సుచిత్‌ చెరో వికెట్‌ తీశారు. 

నడిపించిన రోహ , మయాంక్‌ 
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కర్ణాటక 14 పరుగుల వద్దే ఓపెనర్‌ శరత్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో వికెట్‌ కోల్పోయేలోగానే మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఓపెనర్‌ రోహన్ కదమ్‌కు జతయిన మయాంక్‌ కర్ణాటకను వేగంగా నడిపించాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఈ జోడీ తేలిగ్గా ఆడేసింది. దీంతో ఓవర్‌కు సగటున 8 పరుగులు సాధిస్తూ లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో మొదట రోహన్, ఆ తర్వాత మయాంక్‌ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహన్ నిష్క్రమణ తర్వాత వచ్చిన కరుణ్‌ నాయర్‌ (8 నాటౌట్‌) అండతో మయాంక్‌ చెలరేగాడు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే కర్ణాటక విజయాన్ని అందుకుంది. సమద్‌ ఫలా, దివ్యాంగ్‌ చెరో వికెట్‌ తీశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top