అశ్విన్‌ను టీమిండియా కెప్టెన్‌ చెయ్యండి

Joe Dawes Opined Ashwin is Good Captain - Sakshi

సాక్షి, ముంబై: టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టీంకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంచి సక్సెస్‌ రేటుతో సమర్థవంతంగా జట్టును నడిపిస్తూ పంజాబ్‌ను ప్లే ఆఫ్‌కి చేరువలో నిలిపాడు. ఈ నేపథ్యంలో అశ్విని శక్తిసామర్థ్యాలను ఓ అంచనా వేసిన ఆసీస్‌ మాజీ ప్లేయర్‌ జోయ్‌ దావ్స్.. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ‌‌.

టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ అయిన జోయ్‌ దావ్స్‌ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ... ‘అశ్విన్‌ చాలా గొప్ప ఆటగాడు. మైదానంలో అతని మేధస్సు అద్భుతంగా పని చేస్తుంటుంది. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బౌలర్లకు అతనిచ్చే స్వేచ్ఛ ఏ కెప్టెన్‌లోనూ కనిపించలేదు. అందుకే పంజాబ్‌ టీం బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పైగా డేవిడ్‌ మిల్లర్‌, యువీ, ఫించ్‌లను పక్కనపెట్టాలన్న అతని నిర్ణయాలు బాగా పనిచేశాయి. అన్నింటికి మించి గేల్‌ బ్యాటింగ్ అశ్విన్‌కు కలిసొచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అతను సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తాడన్న నమ్మకం ఉంది. అతన్ని టీమిండియా కెప్టెన్‌ చేస్తే మంచిదన్నది నా అభిప్రాయం’ అని దావ్స్‌ తెలిపారు. 

ఇక కొత్తరకం బంతులు సంధించాలన్న అశ్విన్‌ ఆరాటం.. భవిష్యత్తులో అతన్ని మరింత గొప్ప ఆటగాడిగా మలుస్తుందని దావ్స్‌ అన్నారు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్‌ లైనప్‌ అంత పటిష్టంగా లేదని, భువీ, బుమ్రాలను మాత్రమే నమ్ముకుంటే సరిపోదని ఆయన చెప్పారు. టెస్ట్‌ క్రికెట్‌లోనే రాణిస్తున్న షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు వన్డేలో కూడా సత్తా చాటగలరన్న నమ్మకం తనకుందని, వరల్డ్‌ కప్‌ కోసం వారిని సిద్ధం చేయాల్సిన అవసరం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉందని దావ్స్‌ పేర్కొన్నారు. కాగా, దావ్స్‌   2012-2014 మధ్య టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా పని చేశారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top