breaking news
Joe Dawes
-
అశ్విన్‌ను టీమిండియా కెప్టెన్ చెయ్యండి
సాక్షి, ముంబై: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీంకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంచి సక్సెస్ రేటుతో సమర్థవంతంగా జట్టును నడిపిస్తూ పంజాబ్‌ను ప్లే ఆఫ్‌కి చేరువలో నిలిపాడు. ఈ నేపథ్యంలో అశ్విని శక్తిసామర్థ్యాలను ఓ అంచనా వేసిన ఆసీస్ మాజీ ప్లేయర్ జోయ్ దావ్స్.. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు . టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ అయిన జోయ్ దావ్స్ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ... ‘అశ్విన్ చాలా గొప్ప ఆటగాడు. మైదానంలో అతని మేధస్సు అద్భుతంగా పని చేస్తుంటుంది. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బౌలర్లకు అతనిచ్చే స్వేచ్ఛ ఏ కెప్టెన్‌లోనూ కనిపించలేదు. అందుకే పంజాబ్ టీం బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పైగా డేవిడ్ మిల్లర్, యువీ, ఫించ్‌లను పక్కనపెట్టాలన్న అతని నిర్ణయాలు బాగా పనిచేశాయి. అన్నింటికి మించి గేల్ బ్యాటింగ్ అశ్విన్‌కు కలిసొచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అతను సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తాడన్న నమ్మకం ఉంది. అతన్ని టీమిండియా కెప్టెన్ చేస్తే మంచిదన్నది నా అభిప్రాయం’ అని దావ్స్ తెలిపారు. ఇక కొత్తరకం బంతులు సంధించాలన్న అశ్విన్ ఆరాటం.. భవిష్యత్తులో అతన్ని మరింత గొప్ప ఆటగాడిగా మలుస్తుందని దావ్స్ అన్నారు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ లైనప్ అంత పటిష్టంగా లేదని, భువీ, బుమ్రాలను మాత్రమే నమ్ముకుంటే సరిపోదని ఆయన చెప్పారు. టెస్ట్ క్రికెట్లోనే రాణిస్తున్న షమీ, ఉమేశ్ యాదవ్‌లు వన్డేలో కూడా సత్తా చాటగలరన్న నమ్మకం తనకుందని, వరల్డ్ కప్ కోసం వారిని సిద్ధం చేయాల్సిన అవసరం టీమ్ మేనేజ్మెంట్కు ఉందని దావ్స్ పేర్కొన్నారు. కాగా, దావ్స్ 2012-2014 మధ్య టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. -
ఇషాంత్ ‘ఎక్స్ట్రా’ ప్రాక్టీస్
రాంచీ: మూడో వన్డేలో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ఇషాంత్ శర్మ... తన బౌలింగ్‌పై మరింత దృష్టి పెట్టాడు. సోమవారం జరిగిన అప్షనల్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ కోచ్ జో డావెస్తో కలిసి రెండు గంటల పాటు సుదీర్ఘంగా కసరత్తులు చేశాడు. సహచరులు విశ్రాంతికే పరిమితమైనా... లంబూ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. జేఎస్సీఏ స్టేడియంలో మధ్యాహ్నం ప్రాక్టీస్‌కు వచ్చిన ఇషాంత్ లైన్ అండ్ లెంగ్త్‌పై కోచ్ ఎక్కువగా దృష్టిపెట్టాడు. మరో పేసర్ జైదేవ్ ఉనాద్కట్ కూడా ఇషాంత్‌తో పాటు ప్రాక్టీస్‌కు వచ్చాడు. ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్ జట్టు కూడా ఉదయం ప్రాక్టీస్‌లో పాల్గొంది. మరోవైపు రేపు (బుధవారం) జరగనున్న నాలుగో వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉంది. సోమవారం సాయంత్రం గంటకు పైగా భారీ వర్షం కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే రాంచీ అభిమానులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. కొత్తగా నిర్మించిన జేఎస్సీఏ స్టేడియం సామర్థ్యం 40 వేలు కాగా ఇప్పటికే దాదాపుగా టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ స్టేడియంలో ఇది రెండో వన్డే మ్యాచ్. జనవరి 19న ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.