గంభీర్‌తో గొడవపై పదేళ్ల తర్వాత..

Its A Misunderstanding, Kamran Akmal On Clash With Gambhir - Sakshi

నాకు గౌతీ మంచి మిత్రుడు

అది జరగాల్సింది కాదు.. కమ్రాన్‌ అక్మల్‌

కరాచీ:  పదేళ్ల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌తో జరిగిన వాగ్వాదంపై పాకిస్తాన్‌ వెటరన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ పెదవి విప్పాడు. ఆనాటి గొడవపై మాట్లాడుతూ.. అది కావాలని జరిగింది కాదని, ఆ సమయంలో అపార్థం చోటు చేసుకోవడంతోనే అలా జరిగిందన్నాడు. 2010లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో గౌతం గంభీర్‌-కమ్రాన్‌ అక్మల్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ కొట్టుకునేలా తమ నోటికి పని చెప్పడంతో అంపైర్లు చొరవతో దానికి ముగింపు పలికారు. గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. కమ్రాన్ అక్మల్  పదే పదే కీపర్ క్యాచ్‌ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన గంభీర్ అతనికి చిన్నపాటి వార్నింగ్ ఇవ్వగా.. కమ్రాన్ అక్మల్ కూడా అదే తరహాలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఓవర్‌లో వచ్చిన బ్రేక్‌తో ఇద్దరూ మరోసారి మాటలు తూటాలు పేల్చుకున్నారు.  ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా కనిపించారు. అయితే మధ్యలో అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు అక్కడే ఉన్న ఎంఎస్‌ ధోని.. గంభీర్‌ని శాంతపరిచాడు. ఆపై 2012-13 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ శర్మపై అక్మల్‌ నోరు పారేసుకున్నాడు.(తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో)

ఈ రెండు ఘటనలు అనుకోకుండా జరిగినవేనని కమ్రాన్‌ అక్మల్‌ తెలిపాడు. ‘నేను-గంభీర్‌ మంచి ఫ్రెండ్స్‌. మేమిద్దరం లిస్ట్‌-ఎ క్రికెట్‌ ఆడే క్రమంలో స్నేహితులుగా ఉండేవాళ్లుం. ఆనాడు గంభీర్‌తో గొడవ ఎందుకు వచ్చిందో కూడా సరిగా తెలియదు. కావాలని గంభీర్‌తో గొడవ పడలేదు. ఇషాంత్‌ శర్మతో గొడవ ఘటన కూడా అంతే. నాకు ఇషాంత్‌ కూడా స్నేహితుడే. నేను ఫీల్డ్‌లో ఎక్కువగా మాట్లాడను. అవి చాలా చిల్లర ఘటనలు. మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఫీల్డ్‌లో జరిగింది అక్కడికే పరిమితం’ అని కమ్రాన్‌ తెలిపాడు. పాకిస్తాన్‌ తరఫున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లను కమ్రాన్‌ ఆడాడు. 2017లో పాకిస్తాన్‌ తరఫున చివరిసారి కనిపించాడు కమ్రాన్‌. ఆ తర్వాత పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ఆ స్థానాన్ని సర్ఫరాజ్‌ అహ్మద్‌ భర్తీ చేయడంతో కమ్రాన్‌కు చోటు లేకుండా పోయింది. ఒకానొక సమయంలో కమ్రాన్‌పై సర్ఫరాజ్‌ బహిరంగ విమర్శలు కూడా చేశాడు. కమ్రాన్‌ జట్టులో చోటు కోల్పోవడానికి సర్ఫరాజ్‌ లాబీయింగ్‌ చేశాడనేది అప్పట్లో బాగా వినిపించింది. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top