పఠాన్‌ రిటైర్మెంట్‌.. స్పందించిన గ్రెగ్‌ చాపెల్‌

Irfan Pathan Retirement: Greg Chappell Recollects Memory - Sakshi

ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న చాపెల్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పఠాన్‌ రిటైర్మెంట్‌పై స్పందించాడు. జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌ సిద్దంగా ఉండేవాడని కితాబిచ్చాడు. అంతేకాకుండా పఠాన్‌ అత్యంత ధైర్యవంతుడని అదేవిధంగా నిస్వార్థపరుడని ప్రశంసించాడు. ‘ఇర్ఫాన్‌ పఠాన్‌ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో శతకానికి దగ్గరగా వచ్చి మంచి ఆల్‌రౌండర్‌ అని నిరూపించుకున్నాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో విశేషంగా రాణించాడు. టెస్టుల్లో కూడా ఆకట్టుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ వికెట్లు పడగొట్టే విధానం నాకు బాగా నచ్చేది. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ సాధించడం ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇన్నింగ్స్‌లలో నాకు బాగా నచ్చింది’అని చాపెల్‌ పేర్కొన్నాడు. 

ఇక పఠాన్‌ ఆట గాడితప్పిందని చాపెల్‌ అడ్డు అదుపు లేని ప్రయోగాలే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌గా తీర్చిద్దిడంలో భాగంగా పఠాన్‌ చేత ఎక్కువగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేపించడంతో బౌలింగ్‌ లయ దెబ్బతిన్నదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటన్నింటిని పఠాన్‌ తీవ్రంగా ఖండించాడు. ‘చాపెల్‌పై ఆరోపణలు చేయడమంటే నేను చేసిన తప్పిదాలను కవర్‌ చేసుకోవడమనే అనుకోవాలి. నేనెప్పుడు స్వింగ్‌ కోల్పోలేదు. నా కెరీర్‌ ఆరంభంలో తొలి ఓవరే నాకు బౌలింగ్‌ ఇచ్చేవారు. కొత్త బంతితో ఎక్కువ స్వింగ్‌ రాబట్టేవాడిని. ఆ తర్వాత నాకు పది ఓవర్ల తర్వాత బౌలింగ్‌ ఇచ్చారు. పది ఓవర్ల తర్వాత బంతి చేతికిస్తే స్వింగ్‌ రాదు కదా. అక్కడే పొరపాటు దొర్లింది. ఆరంభ ఓవర్లలో బంతి ఇవ్వకుండా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న ఈ మార్పే నా కెరీర్‌ను ఇబ్బందులకు గురిచేసింది’ అంటూ పఠాన్‌ పేర్కొన్నాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌ టీమిండియా తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు తీశాడు. అదే విధంగా 2821 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి.   

చదవండి: 
బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి..
ఇర్ఫాన్‌ పఠాన్‌ భావోద్వేగ పోస్టు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top