ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

Ireland Test Cricket With England in Lords - Sakshi

నేటి నుంచి లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో నాలుగు రోజుల టెస్టు

తొలిసారి టెస్టు మ్యాచ్‌లో జెర్సీ నంబర్లతో ఆటగాళ్లు బరిలోకి

లండన్‌: వన్డేల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్‌కు... సంప్రదాయ టెస్టు క్రికెట్‌లోనూ ఉనికి చాటుకునే అవకాశం. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం వేదికగా ఆ జట్టు బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో నాలుగు రోజుల టెస్టులో తలపడనుంది. గతేడాది టెస్టు అరంగేట్రం చేసిన ఐర్లాండ్‌ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి టెస్టులోనే పెద్ద జట్టయిన పాకిస్తాన్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడింది. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులోనూ పరాజయం పాలైనా ఫర్వాలేదనే ప్రదర్శన చేసింది. తాజాగా వన్డే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. పోర్టర్‌ఫీల్డ్‌ నేతృత్వంలోని ఐర్లాండ్‌ జట్టులో కౌంటీల్లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లున్నారు. వీరిలో పేసర్‌ టిమ్‌ ముర్టాగ్‌ ఒకడు. ఇటీవలే అతడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 800 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌ విధ్వంసక ఓపెనర్‌ జాసన్‌ రాయ్, పేసర్‌ స్టోన్‌ ఈ మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అడుగు పెట్టనున్నారు. ఇంగ్లండ్‌ ప్రధాన పేసర్‌ అండర్సన్‌ గాయంతో దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో తొలిసారి ఆటగాళ్లు నంబర్లతో కూడిన జెర్సీలు ధరించి బరిలోకి దిగనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top