ముంబై చాంపియనైంది

Ipl special story on mumbai indians - Sakshi

రెండో ప్రయత్నంలో సఫలం 

ఐపీఎల్‌ మరో 6 రోజుల్లో  

క్రికెట్‌ దేవుడు, బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఐకాన్‌ ప్లేయర్‌గాఉన్న జట్టు ముంబై ఇండియన్‌. ఐదు సీజన్లు గడిచినా చాంపియన్‌ షిప్‌ను  అందుకోలేకపోయింది. ఈ ఐదేళ్లలో ఒకసారి 2010లో ఫైనల్‌ గడప  తొక్కినా... చివరకు చెన్నై చేతిలో చుక్కెదురైంది. ఆరో సీజ¯Œ లో  మాత్రం అదే చెన్నైపై బదులు తీర్చుకున్న సచిన్‌   జట్టు 2013 చాంపియన్‌  అయింది.  

ఐదు సీజన్లుగా అలసట లేని పోరాటం చేసిన ముంబై ఇండియన్‌ జట్టు రాత ఆరో సీజన్‌  నుంచి మారిపోయింది. ఆటగాళ్ల ప్రయత్నానికి అదృష్టం కూడా తోడవడంతో 2013 చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్‌ ఫేవరెట్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో సాధారణ లక్ష్యాన్ని కాపాడుకొని తొలిసారి విజేతగా నిలిచింది. 2010లో ఫైనల్‌ మెట్టుపై తమనో ‘పట్టు’పట్టిన చెన్నైపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఆ తర్వాత ఆడిన ఐదు సీజన్లలో మరో రెండుసార్లు (2015, 2017) టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట ఈ సీజన్‌లో పాంటింగ్‌ సారథ్యంలో తలపడిన ముంబై ఇండియన్స్‌ అనంతరం రోహిత్‌ శర్మ నేతృత్వంలో పుంజుకుంది. సచిన్‌  ఆడిన చివరి ఐపీఎల్‌ కూడా ఇదే. గాయంతో ఫైనల్‌ ఆడలేకపోయిన సచిన్‌  ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు.  

పెప్సీ ఐపీఎల్‌... 
డీఎల్‌ఎఫ్‌ ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగియడంతో పెప్సీకో ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌గా వచ్చింది. దీంతో డీఎల్‌ఎఫ్‌ ఐపీఎల్‌ కాస్తా పెప్సీ ఐపీఎల్‌గా మారింది. తొమ్మిది జట్లతో మొదలైన ఈ సంగ్రామంలో ముంబై ఇండియన్‌ చివరిదాకా పట్టుదలగా ఆడింది. ఇక ఈ లీగ్‌కు చెన్నైలో రాజకీయ ఆందోళనలు వెల్లువెత్తాయి. శ్రీలంకలోని తమిళులపై సింహళీయుల అణచివేత కారణంగా తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడకుండా చూసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ఐపీఎల్‌ పాలకమండలికి, బీసీసీఐకి లేఖ రాసింది. దీంతో లంకేయులెవరూ చెన్నై గడ్డపై అడుగుపెట్టలేదు. లీగ్‌ విషయానికొస్తే 9 జట్లు బరిలోకి దిగగా మొత్తం 76 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్‌ దశలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు, ముంబై ఇండియన్స్‌ సమవుజ్జీగా నిలిచింది. రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో 11 చొప్పున గెలిచి తొలి రెండు స్థానాల్లో ప్లే–ఆఫ్‌ బరిలో నిలిచాయి.
  
చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాళ్ల హవా నడిచిన ఈ లీగ్‌లో మైక్‌ హస్సీ 733 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకోగా, చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌  బ్రేవో 32 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ చేజిక్కించుకున్నాడు. ఇక జట్టు మొత్తంగా చూసుకుంటే పాల్గొన్న తొలి సీజన్‌లోనే ఏమాత్రం అంచనాలు లేని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా ఆడింది. అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థుల మెరుపులకు కళ్లెం వేసి మరీ తక్కువ స్కోర్లను కాపాడుకున్న జట్టేదైనా ఉంటే అది సన్‌ రైజర్సే! మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 119, 126, 136 పరుగుల్ని చేసి... టి20ల్లో అతిసాధారణమనే ఈ లక్ష్యాల్ని నిలబెట్టుకోవడం గొప్ప విశేషం. బౌలర్లు స్టెయిన్‌ , ఇషాంత్‌ శర్మ, కరణ్‌ శర్మ, డారెన్‌ స్యామీ సమష్టిగా రాణించారు.   లీగ్‌ దశ ముగియడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై, ముంబై ప్లే ఆఫ్‌ అడ్వాంటేజ్‌ పొందగా, మూడు, నాలుగో స్థానాల్లో           ఉన్న   రాజస్తాన్‌, సన్‌ రైజర్స్‌ ఎలిమినేటర్‌ ఆడాయి. ఇందులో రాజస్తాన్‌ జట్టు ముందంజ వేయగా... హైదరాబాద్‌ ఆట ముగిసింది. తొలి క్వాలిఫయర్‌లో ముంబైని ఓడించిన చెన్నై నేరుగా ఫైనల్‌ చేరింది. ప్లే ఆఫ్‌ సౌలభ్యంతో ముంబై రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది.  

ఫైనల్‌ డ్రామా... 
ఈ లీగ్‌లో చెన్నై బ్యాటింగ్‌ పవర్‌ సూపర్‌. 200 పైచిలుకు పరుగులు చేయడమే కాకుండా... 180, 170, 190 పరుగులకు పైగా లక్ష్యాల్ని ఛేదించింది. కానీ ఫైనల్లో మాత్రం ముంబై తమ ముందుంచిన 149 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. మొదట పొలార్డ్‌ (32 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులతో ముంబై 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. తర్వాత చెన్నై 2, 2, 3, 35 చూస్తుండగానే 39 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. మలింగ (2/22), జాన్సన్‌  (2/19), హర్భజన్‌  (2/14)ల ధాటికి చెన్నై ఇన్నింగ్స్‌ కాస్తా పేకమేడలా కూలింది. 58 పరుగులు చేసేసరికి 8 వికెట్లు!! కానీ కెప్టెన్‌  ధోని (45 బంతుల్లో 63 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో నిర్ణీత ఓవర్లు ఆడేసి 9 వికెట్లకు 129 పరుగులు చేసింది. 23 పరుగులతో గెలిచిన ముంబై తొలిసారి లీగ్‌ చాంపియన్‌ అయింది. 

దక్క¯Œ  ఔట్‌... రైజర్స్‌ ఇన్‌ 
ఈ ఆరో సీజన్‌లోనూ 2012లాగే తొమ్మిది జట్లే ఆడాయి. కానీ జట్టు మారింది. హైదరాబాదీ  ఆధీనంలోని దక్కన్‌  చార్జర్స్‌ ఫ్రాంచైజీ రద్దయింది. చెన్నైకి చెందిన ప్రముఖ సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఆధీనంలోకి హైదరాబాద్‌ వెళ్లింది. 2009 చాంపియన్‌ అయిన దక్కన్‌  చార్జర్స్‌... కొచ్చి టస్కర్స్‌ కేరళలాగే నిర్ణీత బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వకపోవడంతో బీసీసీఐ దక్కన్ను లీగ్‌ నుంచి తప్పించింది. 
కుదిపేసిన ‘స్పాట్‌’ 

మీకు తెలుసా... ప్రస్తుతం బీసీసీఐ కార్యవర్గంతో పాటు ‘సుప్రీం’ నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) రావడానికి, తొలిసారిగా బోర్డులో సంస్కరణలు చేయడానికి, ప్రొఫెషనలిజాన్ని (సీఈఓ) తేవడానికి... ఇవన్నీ రావడానికి ఈ సీజనే కారణం. అదెలాగంటే ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ జరిగింది ఈ సీజన్‌లోనే. రాజస్తాన్‌ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్‌ చవాన్‌ , అజిత్‌ చండిలా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులకు ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు. ముకుల్‌ ముద్గల్‌ కమిటీ విచారణ, తదనంతరం లోధా కమిటీ సిఫార్సులు. సంస్కరణలు అవన్నీ ఇప్పటికీ కొనసా...గుతున్నాయి.

ప్లేయర్‌ 
ఆఫ్‌ ద సిరీస్‌: వాట్సన్‌
రాజస్తాన్‌  రాయల్స్‌  

అత్యధిక పరుగులు 
ఆరెంజ్‌ క్యాప్‌: హస్సీ 
చెన్నై: 733  

అత్యధిక వికెట్లు 
పర్పుల్‌  క్యాప్‌: బ్రేవో 
చెన్నై: 32  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top