పంజాబ్‌తో మ్యాచ్‌: కేకేఆర్‌ ఘన విజయం

IPL 2019 KKR Claims A 28 Runs Victory Against Kings Punjab - Sakshi

28 పరుగుల తేడాతో పంజాబ్‌ ఓటమి

మయాంక్‌, మిల్లర్‌ల పోరాటం వృథా

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో కేకేఆర్‌ జయభేరి మోగించింది. మొదట పంజాబ్‌ బౌలర్లను కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ ఉతికారేయగా.. అనంతరం పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ను కేకేఆర్‌ బౌలర్లు కట్టడి చేశారు. కార్తీక్‌ సేన నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. నిర్ణీత 20ఓవర్లలో 175 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి చవిచూసింది. మయాంక్‌ అగర్వాల్‌(58), డేవిడ్‌ మిల్లర్‌(59 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.  

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కేఎల్‌ రాహుల్‌(1) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం క్రిస్‌గేల్‌ (20) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మయాంక్‌ ఎంతో పట్టుదలను ప్రదర్శించాడు. సర్ఫరాజ్‌(13) కూడా వెంటనే ఔట్‌ అవ్వడంతో పంజాబ్‌ మరింత కష్టాల్లో పడింది. ఈ తరుణంలో డేవిడ్‌ మిల్లర్‌తో జతకట్టిన మయాంక్‌ ఎంతో ఓర్పుగా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. కానీ భారీ లక్ష్యం కావడంతో రన్‌రేట్‌ చాలా పెరిగింది. మయాంక్‌ అవుటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌ ఎడాపెడా బౌండరీలు బాదినా జట్టును విజయాన్ని అందించలేకపోయాడు. కేకేఆర్‌ బౌలర్లలో రసెల్‌ రెండు వికెట్లు పడగొట్టగా, ఫెర్గుసన్‌, చావ్లా తలో వికెట్‌ తీశారు. 

అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించలేదు. క్రిస్‌ లిన్‌(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మరో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(24) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా.. భారీ స్కోర్‌ చేయలేకపోయాడు. దీంతో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రాబిన్‌ ఊతప్ప(61), నితీష్‌ రాణాలు ఆచితూచి ఆడారు. క్రీజులో నిలదొక్కుకున్న అనంతరం గేర్‌ మార్చి దాటిగా ఆడటం ప్రారంభించారు. ముఖ్యంగా రాణా అశ్విన్‌ బౌలింగ్‌ను టార్గెట్‌ చేస్తూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో రెండో అర్దసెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్‌కు యత్నించి రాణా(63) ఔటవుతాడు. 

భారీ మూల్యం చెల్లించుకున్నారు
రసెల్‌ మూడు పరుగుల వ్యక్తి గత స్కోర్‌ వద్ద షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అయితే ఆ బంతి నోబాల్‌ కావడంతో.. పంజాబ్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆతర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్‌ బౌలర్లు నేలచూపులు చూశారు. బౌలర్‌ ఎవరు.. ఏబంతి వేశాడనేది చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా రసెల్‌ ఆడాడు. దీంతో కేకేఆర్‌ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి రసెల్‌(48) క్యాచ్‌ ఔటయ్యాడు. లేకుంటే తన ఖాతాలో హాఫ్‌ సెంచరీ.. స్కోర్‌ బోర్డుపై మరో పది పరుగులు ఉండేవి. దీంతో కేకేఆర్‌ ఆటగాళ్ల వీరవిహారంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top