షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం

Published Sun, Jul 28 2019 5:10 AM

IOA proposes boycott of 2022 Commonwealth Games for shooting snub - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా 2022లో జరుగనున్న కామన్వెల్త్‌ క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తప్పిస్తే... తాము ఏకంగా ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) హెచ్చరిక జారీ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు సత్వరమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా శనివారం లేఖ రాశారు. గత నెలలో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మీటింగ్‌లో రాబోయే కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించి, మరో మూడు కొత్త క్రీడలను చేర్చాలని కామన్వెల్త్‌ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్‌) ప్రతిపాదన తెచ్చింది. ఇదే జరిగితే... పతకాల పరంగా భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. పట్టికలోనూ కిందకు పడిపోతుంది.

ఈ 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో మన దేశం 66 పతకాలు సాధించగా, అందులో 16 షూటింగ్‌లో వచ్చినవే.  నేపథ్యంలో తమ నిరసనగా సెప్టెంబరులో రువాండాలో జరుగనున్న సీజీఎఫ్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేది లేదని ఐఓఏ తేల్చిచెప్పింది. సమాఖ్య రీజనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా, స్పోర్ట్స్‌ కమిటీ సభ్యత్వానికి నామ్‌దేవ్‌ షిర్గాంకర్‌ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంది. ‘ఇలాంటి అసంబద్ధ ఆలోచనలపై మా నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయదల్చుకున్నాం. మేం ఇంకా బ్రిటిష్‌ పాలనలో లేమని వారు తెలుసుకోవాలి. భారత్‌ ఏ క్రీడలో పట్టు సాధిస్తే అందులో నిబంధనలు మార్చడమో, మరో అడ్డంకి సృష్టించడమో చేస్తున్నారు. ఈసారి మాత్రం వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం’ అని బాత్రా తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement