స్వర్ణాల్లో సెంచరీ... పతకాల్లో డబుల్‌ సెంచరీ

Indian Players Is Doing Well In The South Asian Games - Sakshi

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ అమేయం

214 పతకాలతో అగ్రస్థానంలో

అన్ని క్రీడాంశాల్లో అదరగొట్టే ప్రదర్శన

కఠ్మాండు (నేపాల్‌): తమ ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటూ దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. ఈ క్రీడల చరిత్రలో ఆరోసారి ‘స్వర్ణ’ పతకాల సెంచరీని పూర్తి చేసుకుంది. అదే క్రమంలో మొత్తం పతకాల్లో డబుల్‌ సెంచరీని దాటింది. ఈ క్రీడల్లో ఏడో రోజు శనివారం భారత్‌ మొత్తం 49 పతకాలు కొల్లగొట్టగా... అందులో 29 స్వర్ణాలు ఉండటం విశేషం. ప్రస్తుతం భారత్‌ 110 స్వర్ణాలు, 69 రజతాలు, 35 కాంస్యాలతో కలిపి మొత్తం 214 పతకాలతో ‘టాప్‌’లో కొనసాగుతోంది. 43 స్వర్ణాలు, 34 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 142 పతకాలతో నేపాల్‌ రెండో స్థానంలో ఉంది. శనివారం స్విమ్మర్లు, రెజ్లర్లు, షూటర్ల ప్రదర్శనతో భారత పసిడి పతకాల సంఖ్య 100 దాటింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్‌ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌), రిచా మిశ్రా (800 మీ. ఫ్రీస్టయిల్‌), శివ (400 మీ. వ్యక్తిగత మెడ్లే), మానా పటేల్‌ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌), చాహాత్‌ అరోరా (50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌), లిఖిత్‌ (50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌), రుజుతా భట్‌ (50 మీ. ఫ్రీస్టయిల్‌) స్వర్ణాలు సాధించారు.

రెజ్లింగ్‌లో సత్యవర్త్‌ కడియాన్‌ (పురుషుల ఫ్రీస్టయిల్‌ 97 కేజీలు), సుమీత్‌ మలిక్‌ (పురుషుల ఫ్రీస్టయిల్‌ 125 కేజీలు), గుర్‌శరణ్‌ప్రీత్‌ కౌర్‌ (మహిళల 76 కేజీలు), సరితా మోర్‌ (మహిళల 57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 97 కేజీల ఫైనల్లో పాక్‌ రెజ్లర్‌ తబియార్‌ ఖాన్‌ను సత్యవర్త్‌ చిత్తుగా ఓడించాడు. ఇక షూటింగ్‌లో మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో అనీశ్‌ భన్వాలా... టీమ్‌ విభాగంలో అనీశ్, భావేశ్, ఆదర్శ్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు... 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మెహులీ ఘోష్‌–యశ్‌ వర్ధన్‌ జంటకు స్వర్ణాలు దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 81 కేజీల విభాగంలో సృష్టి సింగ్‌... 87 కేజీల విభాగంలో అనురాధ బంగారు పతకాలు గెలిచారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top