మెరుగైన స్థితిలో భారత్‌; సౌతాఫ్రికా 275 ఆలౌట్‌

India Vs South Africa 2nd Test Day 3 Proteas Team All Out In 1st Innings At 275 - Sakshi

పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డ సఫారీ బ్యాట్స్‌మెన్‌

ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

దక్షిణాఫ్రికా 275 ఆలౌట్‌.. అశ్విన్‌కు నాలుగు వికెట్లు

మరో రెండు రోజులు మిగిలి ఉన్న ఆట

పుణె : మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్‌ చేసిన కోహ్లి సేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఫలితంగా పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 36/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టును భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు వికెట్లతో రాణించాడు. ఉమేష్‌ యాదవ్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు, జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇదిలాఉండగా.. సౌతాఫ్రికాపై అత్యధిక టెస్ట్‌ వికెట్లను తీసుకున్న నాలుగో భారత ఆటగాడిగా అశ్విన్‌ నిలిచాడు. అనిల్‌ కుంబ్లే (84), జవగళ్‌ శ్రీనాథ్‌ (64, హర్భజన్‌ సింగ్‌ (60) తర్వాతి స్థానంలో అశ్విన్‌ (50) ఉన్నాడు.
(చదవండి : రోహిత్‌ను ముద్దాడేందుకు... మైదానంలోకి..)

ఇక భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (64), డికాక్‌ (31), బ్రూయెన్‌ (30) మినహా మిగతా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే, 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్‌ మహరాజ్‌, ఫిలాండర్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్‌ మహరాజ్‌ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్‌ (164 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) పోరాటంతో సఫారీ జట్టు ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. నిర్ణీత సమయం ముగియడంతో మూడోరోజు ఆటకు విరామం ఇచ్చారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉంది. ఇక ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్‌ ఆడించాలా..? లేక రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేపట్టాలా అనే విషయంపై కోహ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
(చదవండి : ద్విశతక కోహ్లినూర్‌...)

తలో చేయి వేశారు..
మార్నింగ్‌ సెషన్‌ మొదలైన కొద్దిసేపటికే మహ్మద్‌ షమీ నూర్జే (3)ని ఔట్‌ చేశాడు. దీంతో 41 పరుగుల వద్ద పర్యాటక జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్లను వెంటవెంటనే పెవిలియన్‌ చేర్చి హడలెత్తించిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ క్రీజులో కుదురుకున్న బ్రూయెన్‌ (30 పరుగులు, 58 బంతులు, 6 ఫోర్లు)ను ఔట్‌ చేశాడు. ఇక ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తలకెత్తుకున్న క్వింటన్‌ డికాక్‌, కెప్టెన్‌ డుప్లెసిస్‌ జోడీని అశ్విన్‌ విడగొట్టాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో డికాక్‌ (48 బంతుల్లో 31; 7 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

దీంతో డుప్లెసిస్‌-డికాక్‌ హాఫ్‌ సెంచరీ భాగస్వామానికి తెరపడింది. అప్పటికీ జట్టు స్కోరు 128/6. ఇక ఏడో వికెట్‌గా ముత్తుసామి (20 బంతుల్లో 7 పరుగులు)ని జడేజా ఎల్బీగా వెనక్కు పంపాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్‌) నిదానంగా ఆడుతూ పరుగులు రాబడుతున్న క్రమంలో అశ్విన్‌ వేసిన చక్కని బంతికి అతను కూడా పెవిలియన్‌ చేరక తప్పలేదు. కేశవ్‌ మహరాజ్‌ తొమ్మిదో వికెట్‌గా, రబడ పదో వికెట్‌గా పెవిలియన్‌ చేరారు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top