వెస్టిండీస్‌  చేతిలోనే... 

India  only loss in Vizag - Sakshi

వైజాగ్‌లో భారత్‌కు ఏకైక ఓటమి

మరో 6 విజయాలు సాధించిన టీమిండియా

ధోని తొలి సెంచరీ చిరస్మరణీయం

సాక్షి క్రీడా విభాగం : విశాఖపట్నంలో వన్డే మ్యాచ్‌ అనగానే ధోని ఉప్పెన గుర్తుకు రావడం సహజం. 13 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అతను సృష్టించిన వీర విధ్వంసం అభిమానులందరి మదిలో అలా నిలిచిపోయింది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం ఐదు వన్డేలకు ఆతిథ్యమిచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన స్టేడియంలో అదే తొలి మ్యాచ్‌ కూడా కావడం విశేషం. ధోని మాత్రమే కాదు... సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లి కూడా సాగర తీరంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వ్యక్తిగతంగానే కాకుండా ఫలితాల పరంగా టీమిండియాకు దీనిని కలిసొచ్చిన వేదికగా చెప్పవచ్చు. 2005 ఏప్రిల్‌ 5 నుంచి 2017 డిసెంబర్‌ 17 వరకు ఇక్కడ 7 వన్డేలు జరిగాయి. వీటిలో 6 గెలిచిన భారత్‌ ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లను ఒక్కోసారి ఓడించిన భారత్, శ్రీలంకపై రెండు సార్లు గెలుపొందింది. ఒకసారి మాత్రం విండీస్‌ చేతిలో పరాజయం పాలైంది. ఐదేళ్ల క్రితం తమపై గెలుపొందిన ప్రత్యర్థితోనే బుధవారం మరో మ్యాచ్‌లో భారత్‌ తలపడనున్న నేపథ్యంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–
 

వీడీసీఏ స్టేడియంలో జరిగిన వన్డేల విశేషాలు చూస్తే... 
►2005లో పాకిస్తాన్‌పై ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. ధోని కెరీర్‌లో ఇది ఐదో మ్యాచ్‌ కాగా...అతను సాధించిన తొలి సెంచరీ ఇదే.  
► 2007లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహరూఫ్‌ వేసిన 41వ ఓవర్లో యువరాజ్‌ సింగ్‌ వరుసగా 4 4 0 6 4 4 బాది మ్యాచ్‌ను గెలిపించాడు. 
►  భారత్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ 2010లో ఇక్కడే తమ తొలి మ్యాచ్‌ ఆడారు. ధావన్‌ 2 బంతులు ఆడి ‘డకౌట్‌’ కాగా, స్టార్క్‌ ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.  
► 2011లో జరిగిన వన్డేలో వెస్టిండీస్‌ పదో నంబర్‌ ఆటగాడు రవి రాంపాల్‌ 66 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో పదో స్థానంలో ఒక బ్యాట్స్‌మన్‌ సాధించిన అత్యధిక స్కోరు రికార్డు ఇదే.  
►2013లో జరిగిన వన్డేలో వెస్టిండీస్‌ 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నలుగురు విండీస్‌ ఆటగాళ్లు అర్ధసెంచరీలు సాధించారు. ధోని తన కెరీర్‌లో 50వ అర్ధ సెంచరీని ఇదే మ్యాచ్‌లో నమోదు చేయడం విశేషం. తీవ్రమైన మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సార్లు బంతిని మార్చాల్సి రావడం భారత్‌కు ప్రతికూలంగా మారింది.  
►2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అమిత్‌ మిశ్రా 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ వన్డే చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో (23.1) ఆలౌట్‌ అయిన మ్యాచ్‌ ఇదే.  

కోహ్లి స్పెషల్స్‌... 
విశాఖలో కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లో కోహ్లి వరుసగా 118, 117, 99, 65 పరుగులు చేయడం విశేషం. ఇక్కడ జరిగిన ఏకైక టి20లో కోహ్లి ఆడలేదు. అయితే ఇంగ్లండ్‌తో 2016లో జరిగిన ఏకైక టెస్టులోనూ విరాట్‌ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 167, 81 పరుగులు సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top