భారత్‌కు కాంస్యం | India of bronze | Sakshi
Sakshi News home page

భారత్‌కు కాంస్యం

Feb 20 2016 11:32 PM | Updated on Sep 3 2017 6:03 PM

భారత్‌కు కాంస్యం

భారత్‌కు కాంస్యం

సొంతగడ్డపై అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో

సెమీస్‌లో 1-3తో ఇండోనేసియా చేతిలో ఓటమి
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్

 
సాక్షి, హైదరాబాద్:  సొంతగడ్డపై అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో తమ పోరాటాన్ని ముగించింది. ఇండోనేసియాతో శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. ఈ పోటీల చరిత్రలో భారత్‌కు కాంస్యం దక్కడం ఇదే ప్రథమం. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 23-25, 21-9తో ప్రపంచ పదో ర్యాంకర్ టామీ సుగియార్తోను ఓడించి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. గతంలో సుగియార్తోతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకసారి మాత్రమే నెగ్గిన శ్రీకాంత్ ఈసారి పైచేయి సాధించాడు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో విజయావకాశం లభించినా కీలకదశలో తప్పిదాలు చేశాడు. దాంతో మ్యాచ్ మూడో గేమ్‌కు వెళ్లింది. ఈ గేమ్‌లో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.


రెండో మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం కనీసం పోటీనివ్వకుండానే చేతులెత్తేసింది. ప్రపంచ రెండో ర్యాంక్ జంట మొహమ్మద్ హసన్-హెంద్రా సెతియవాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్-మనూ అత్రి జోడీ 11-21, 10-21తో పరాజయం పాలైంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది.

మూడో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ నిరాశ పరిచాడు. ప్రపంచ 34వ ర్యాంకర్, ఇండోనేసియా భవిష్యత్ తార జిన్‌టింగ్ ఆంథోనీతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్ జయరామ్ 15-21, 20-22తో ఓడిపోయాడు. దాంతో ఇండోనేసియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో భారత జంట ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ పోరాడినా ఫలితం లేకపోయింది. ప్రపంచ 10వ ర్యాంక్ జోడీ అంగా ప్రతమా-రికీ కరాంద సువార్ది 21-13, 18-21, 21-15తో ప్రణవ్-అక్షయ్ జంటను ఓడించడంతో ఇండోనేసియా 3-1తో విజయాన్ని దక్కించుకొని ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో ఇండోనేసియా తలపడుతుంది. మహిళల  ఫైనల్లో జపాన్‌తో చైనా ఢీకొంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement