ఇంకెప్పుడ్రా మా మ్యాచ్‌.!

As India Gears Up for First Match Indian Fans Mock Delay - Sakshi

మేమంతా అస్థిపంజరాలు కావాలా ఏందీ

లండన్‌ : ప్రపంచకప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌ ఆలస్యంపై భారత అభిమానులు కుళ్లుజోకులు పేల్చుతున్నారు. టోర్నీ ప్రారంభమై దాదాపు వారం అవుతున్నా.. ఇప్పటికే కొన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడినా భారత్‌ ఇంతవరకు మ్యాచ్‌ ఆడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భారత్‌ (రేపు) బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. భారత్‌కు ఇది తొలి మ్యాచ్‌ అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం మూడోవది కావడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. తమ ఫొటో షాప్‌ నైపుణ్యానికి పని చెప్పి మరి ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ‘కోడి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైనా భారత్‌ మ్యాచ్‌ ఆడేటట్టు లేదుగా’ అని ఒకరు.. ‘ఆటగాళ్లంతా డగౌట్‌లో కూర్చుని అస్థిపంజరాలైనా ఐసీసీ మ్యాచ్‌’ ఆడించేటట్టు లేదని కామెంట్‌ చేస్తున్నారు.

ఆలస్యానికి కారణం ఏంటంటే!
వాస్తవానికి ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఆలస్య ఎంట్రీకి బీసీసీఐనే కారణం. ఐపీఎల్ 2019 సీజన్‌లో నెలన్నరపాటు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడిన భారత్ ఆటగాళ్లకి విశ్రాంతి కావాలని స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బీసీసీఐ అభ్యర్థించింది. దీంతో.. భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని సవరించిన ఐసీసీ.. టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్‌ను రూపొందించింది. మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 సీజన్ మే 12న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ ఫైనల్‌కి ముందే స్వదేశాలకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.

 

మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు నియమిత లోధా కమిటీ.. టీమిండియా ఆడే టోర్నీ, టోర్నీకి మధ్య కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలని సిఫారసు చేసింది. దీంతో.. ఐపీఎల్, ప్రపంచకప్‌ మధ్య ఈ వ్యవధి నియమాన్ని బీసీసీఐ పాటించినప్పటికీ.. ఆటగాళ్లకి మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఐసీసీని అభ్యర్థించింది. ఈ బ్రేక్ టైమ్.. ఆటగాళ్ల ప్రాక్టీస్‌తో గాయపడిన క్రికెటర్లు ఫిట్‌నెస్ సాధించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడింది. ఐపీఎల్‌లో గాయపడిన కేదార్ జాదవ్‌.. ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో ఇతర ఆటగాళ్లతో సాధన చేస్తూ కనిపించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top