
న్యూఢిల్లీ: నిర్వహించిన మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రాతినిధ్యం పరంగా ప్రస్తుత సీజన్ (2018–19) భారత క్రికెట్ దేశవాళీ చరిత్రలో అతి భారీదిగా మిగిలిపోనుంది. ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్–12 ఫైనల్‌తో సీజన్ ముగియనుంది. దీంతో కలిపి 2024 మ్యాచ్‌లు ఆడినట్లు అవుతుంది. ఈ స్థాయిలో మ్యాచ్‌లు జరగడం ఇదే ప్రథమం. కాగా, ఏప్రిల్ 24న జరిగిన మహిళల అండర్–23 చాలెంజర్ ట్రోఫీ ఫైనల్‌తో 2 వేల మ్యాచ్‌లు పూర్తయ్యాయి.
దేశవాళీలో మొత్తం 37 జట్లు 3,444 రోజుల పాటు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాయి. 2017–18లో 28 జట్లు 1,032 మ్యాచ్‌లకు 1892.5 రోజులు మాత్రమే ఆడటం గమనార్హం. పటిష్టమైన ప్రణాళికతోనే ఇది సాధ్యమైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సీజన్ మొత్తంలో 13,015 మంది ఆటగాళ్ల పేర్లు రిజిస్టరవ్వగా, 6471 మంది పాల్గొన్నారు. సీనియర్ స్థాయి సహా, వివిధ వయో విభాగాల మ్యాచ్‌లకు దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాలు ఆతిథ్యమిచ్చాయి. కవరేజీ కోసం బీసీసీఐ 170 మంది చొప్పున వీడియో అనలిస్టులు, స్కోరర్లను వినియోగించింది.