అందుకు నేను సిద్ధమే: హనుమ విహారి

If my captain asks me to open, I will, Hanuma Vihari - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెప్టెన్ విరాట్‌ కోహ్లి అడిగితే తాను ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా ఆటగాడు హనుమ విహారి చెప్పాడు. గత ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన విహారి.. ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్‌లో అనధికార టెస్టులో, ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి కోరితే ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనింగ్‌ చేస్తానని హనుమ విహారి అన్నాడు.

‘ఆసీస్‌లో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లితో పాటు సీనియర్లు ఇంగ్లండ్‌లో నాకు సహకరించారు. ఆస్ట్రేలియాలో ఆడేందుకు అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటున్నాను. ఇంగ్లిష్‌ గడ్డపై నేను హాఫ్ సెంచరీ చేశా. అది గతం. కాకపోతే అక్కడ ఆడినట్టే ఆస్ట్రేలియాలో ఆడతాను. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు నేను సిద్ధం. కెప్టెన్ అడిగితే ఓపెనింగ్‌ చేస్తా. మిడిల్‌, లోయర్‌ ఆర్డరైనా ఫర్వాలేదు. ఇది చాలా పెద్ద సిరీస్‌. చాలా శ్రమించాను. నాపై విశ్వాసం చూపినందుకు కోహ్లికి ధన్యవాదాలు. బ్యాటింగ్‌ నా ప్రధాన బలం. అవసరమైనప్పుడు బౌలింగ్‌ చేస్తా’అని విహారి తెలిపాడు.

సిడ్నీ వేదికగా  క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో తొలి టెస్టుకి దూరమయ్యాడు. దీంతో పృథ్వీ షా స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై జట్టు మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు జట్టులో పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో ఓపెనర్లను ఎంపిక చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top