వింగ్‌ కమాండర్‌ రోహిత్‌కు సెల్యూట్‌

he is not Rohit Sharma, He is Wing Commander Rohit Sharma  - Sakshi

సోషల్‌ మీడియాలో రోహిత్‌పై ప్రశంసల వర్షం

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌ బౌలర్లను చీల్చిచెండాడుతూ రోహిత్‌ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ మంచి సమన్వయంతో పరిణతితో కూడిన ఆటతీరు ప్రదర్శిస్తూ.. దాయాది బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ప్రపంచకప్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన దాయాదితో మ్యాచ్‌లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 140 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. టీమిండియా స్కోరును పరుగులు పెట్టించాడు. దీంతో సోషల్‌ మీడియాలో రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాపం పాకిస్థాన్‌ బౌలర్లపై ‘వింగ్‌ కమాండర్‌ రోహిత్‌ శర్మ’ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశాడని, దీంతో ఆ జట్టు కోలుకోలేకపోయిందని నెటిజన్లు కామెంట్‌ చేశారు. వింగ్‌ కమాండర్ రోహిత్‌ అంటూ అద్భుతమైన మీమ్స్‌ను పోస్టు చేస్తున్నారు. 

పాక్‌ యుద్ధ విమానాల్ని వెంటాడుతూ.. ఆ దేశ భూభాగంలోకి వెళ్లిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ దాయాది దేశంలో వీరోచితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ సందర్భంగా అభినందన్‌ను కించపరుస్తూ.. భారత క్రికెటర్లను అవమానిస్తూ.. పాకిస్థాన్‌లో యాడ్‌ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ బౌలర్లను చిత్తుచిత్తుగా కొట్టిన రోహిత్‌ శర్మను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌తో పోలుస్తూ.. నెటిజన్లు కామెంట్లు, మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. మరోవైపు పుల్వామా దాడి ఘటన తర్వాత తొలిసారి దాయాదులు తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌ను చూస్తూ ఆర్మీ జవాన్లు సైతం సంబరాలు చేసుకున్నారు. కమాన్‌ ఇండియా అంటూ ఎంకరేజ్‌ చేశారు. 

అరుదైన ఘనత..
పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం దాయాది పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో  140 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇది వరల్డ్‌కప్‌ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. పాక్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆండ్రూ సైమండ్స్‌(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో జోహెనెస్‌బర్గ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సైమండ్స్‌ అజేయంగా 143 పరుగులు సాధించాడు. ఇదే నేటికి పాక్‌పై వరల్డ్‌కప్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత స్థానాన్ని రోహిత్‌ ఆక్రమించాడు. రోహిత్‌ తర్వాత రాస్‌ టేలర్‌(న్యూజిలాండ్‌) ఉన్నాడు. 2011 వరల్డ్‌కప్‌లో పాక్‌పై రాస్‌ టేలర్ 131 పరుగులు చేశాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top