
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో తొమ్మిది రౌండ్‌లు ముగిశాక భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ 5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హరికృష్ణ ఆడిన తొమ్మిది గేముల్లో మూడింట గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు.
ప్రజ్ఞానంద, సూర్యశేఖర గంగూలీ, లెవాన్ అరోనియన్‌లపై నెగ్గిన హరికృష్ణ... మమెదైరోవ్, సెర్గీ కర్జాకిన్, ఆనంద్, విదిత్‌లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. నకముర, సో వెస్లీలతో జరిగిన గేముల్లో హరికృష్ణకు ఓటమి ఎదురైంది. 6.5 పాయింట్లతో నకముర (అమెరికా) ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... సో వెస్లీ (అమెరికా) 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నేడు మిగతా తొమ్మిది రౌండ్‌లు జరుగుతాయి.