
హార్దిక్ పాండ్యా(ఫైల్ ఫోటో)
ఇటీవల టీమిండియా ట్వంటీ 20 జట్టులో స్థానం సంపాదించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వీరవిహారం చేశాడు. ఒకే ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
వడోదర(గుజరాత్): ఇటీవల టీమిండియా ట్వంటీ 20 జట్టులో స్థానం సంపాదించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వీరవిహారం చేశాడు. ఒకే ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ముస్తాక్ ఆలీ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ రిలయన్స్ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన టీ 20 లో బరోడా ఆటగాడు హార్దిక్ పాండ్యా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యేకంగా ఢిల్లీ మీడియం పేసర్ అకాశ్ సుడాన్ వేసిన 19.0 ఓవర్ లో ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు సాధించాడు. కాగా, ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు నమోదు చేసిన పలువురు క్రికెటర్ల సరసన చేరే అవకాశాన్ని పాండ్యా తృటిలో కోల్పోయాడు. అంతకుముందు వివిధ ఫార్మెట్లలో ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో సర్ గార్లీఫీల్డ్ సోబర్స్(1968), రవిశాస్త్రి(1985), హెర్షలీ గిబ్స్(2007), యువరాజ్ సింగ్(2007), అలెక్స్ హేల్స్(2015)లు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, అకాశ్ సుడాన్ నాలుగు బైలు, ఒక నోబాల్ తో మొత్తం 39 పరుగులిచ్చి ట్వంటీ 20 లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీంతో గతంలో ట్వంటీ 20 ఫార్మెట్ లో న్యూజిలాండ్ బౌలర్ స్కాట్ స్టారిస్ ఒకే ఓవర్ లో 38 పరుగులిచ్చిన చెత్త రికార్డు చెరిగిపోయింది. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా పాండ్యా 51 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో పాండ్యా రాణించినా బరోడాకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
పాండ్యాకు సుడాన్ వేసిన ఓవర్ ఇలా..
తొలి బంతి - సిక్స్
రెండో బంతి- బై రూపంలో నాలుగు పరుగులు
మూడో బంతి-సిక్స్
నాల్గోబంతి-సిక్స్+ నోబాల్
ఐదో బంతి-ఫోర్
ఆరో బంతి- సిక్స్
ఏడో బంతి-సిక్స్