హామిల్టన్‌దే విక్టరీ

హామిల్టన్‌దే విక్టరీ - Sakshi


బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్‌ కైవసం  

స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్‌ (బెల్జియం): ఫార్ములావన్‌ సీజన్‌లో లూయిస్‌ హామిల్టన్‌ మరో టైటిల్‌ సాధించాడు. ఆదివారం బెల్జియం గ్రాండ్‌ప్రిలో ఈ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది హామిల్టన్‌ సాధించిన ఐదో టైటిల్‌ ఇది. ఓవరాల్‌గా 32 ఏళ్ల ఈ బ్రిటన్‌ రేసర్‌ తన 200వ గ్రాండ్‌ప్రి రేసును విజయంతో ముగించాడు. తన కెరీర్‌లో అతనికిది 58వ విజయం కావడం మరో విశేషం. శనివారం 68వ పోల్‌ పొజిషన్‌తో జర్మనీ రేసింగ్‌ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ రికార్డును సమం చేసిన హామిల్టన్‌ అదే జోరును ప్రధాన రేసులోనూ కనబరిచాడు. 44 ల్యాప్‌ల ఈ ట్రాక్‌లో ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ గట్టి పోటీనిచ్చాడు. కొన్ని ల్యాపుల్లో హామిల్టన్‌కు అత్యంత చేరువైనా... అతని విజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు.



 చివరకు రేసును మెర్సిడెస్‌ డ్రైవర్‌ అందరి కంటే ముందుగా గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 2.358 సెకన్ల వ్యవధిలో వెటెల్‌ రన్నరప్‌గా నిలిచాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో మూడో స్థానంతో పోడియంలో నిలిచాడు. జోరుమీదున్న హామిల్టన్‌ వచ్చే ఆదివారం (సెప్టెంబర్‌ 3) ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రి గెలిస్తే ఈ ఏడాది చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఆధిక్యంలోకి వస్తాడు. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్‌బన్‌ ఒకాన్‌ తొమ్మిదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్‌ సెర్గియో పెరెజ్‌ రేసును పూర్తిచేయలేకపోయాడు. 42 ల్యాపుల్ని పూర్తి చేసిన అతను 17వ స్థానం దక్కించుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top