కమిన్స్‌కు రూ. 15.5కోట్లు: గంభీర్‌ కామెంట్స్‌

Gautam Gambhir Slams KKR For Players Selection In IPL 2020 Auction - Sakshi

ఐపీఎల్‌ వేలంలో కేకేఆర్‌ సెలక్షన్‌ తీరుపై గంభీర్‌ విమర్శలు

న్యూఢిల్లీ: పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతం గంభీర్‌ తప్పుబట్టాడు. ఓ బౌలర్‌ కోసం భారీ మొత్తం చెల్లించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 కోసం జరిగిన వేలంలో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ కమిన్స్‌ను రూ. 15 కోట్ల 50 లక్షలకు కేకేఆర్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా కమిన్స్‌ రికార్డుకెక్కాడు. కాగా కేకేఆర్‌ జట్టును రెండుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిపిన గంభీర్‌ ఈ విషయంపై స్పందించాడు. బౌలర్‌కు అత్యధిక ధర చెల్లించి బ్యాకప్‌ బ్యాట్స్‌మెన్‌ లేకుండా చేసుకున్నారని విమర్శించాడు.

‘కొత్త బంతితో ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతంగా రాణించగలడు. అతడికి మంచి బౌలింగ్‌ నైపుణ్యాలు ఉన్నాయి. డెత్‌ ఓవర్లలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టగలుగుతాడు 2014లో అతడు కేకేఆర్‌తో ఉన్నాడు. ఇక అప్పటితో పోలిస్తే తన ఆట తీరు ఎంతో మెరుగుపడింది. భారీ మొత్తంలో డబ్బు చెల్లించి జట్టు అతడిని కొనుక్కుంది.. కాబట్టి ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు అద్భుత ప్రదర్శన కనబరుస్తాడనుకుంటున్నా. కనీసం 3-4 మ్యాచులైనా ఒంటిచేత్తో గెలిపించగలగాలి. ఇవన్నీ కమిన్స్‌కు సంబంధించిన సానుకూల అంశాలు. 

అయితే ఒకవేళ బ్యాట్స్‌మెన్లు ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌ గాయపడితే పరిస్థితి ఏంటి. వారికి బ్యాకప్‌గా ప్రస్తుత జట్టులో ఎవరూ లేరు. ఇక సునీల్‌ నరైన్‌ విషయానికొస్తే తను బౌలింగ్‌ కూడా చేయగలుగుతాడు. ముందు చెప్పినట్లు ఇయాన్‌ గాయపడితే మిడిలార్డర్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతేకాదు కమిన్స్‌ గాయపడితే అతడి స్థానంలో లాకీ ఫెర్గూసన్‌ ఉంటాడు. కానీ టాప్‌ ఆర్డర్‌లో మాత్రం ఎవరు గాయపడినా వారి స్థానాన్ని భర్తీ చేసేవారు జట్టులో లేరు. మిచెల్‌ మార్ష్‌ను గానీ, మార్కర్‌ స్టోయినిస్‌ను గానీ తీసుకునే ఉంటే బాగుండేది’ అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్‌ 2012, 2014లో జట్టును విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం సొంత జట్టు ఢిల్లీకి తిరిగొచ్చిన గౌతీ.. జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా.. తనకు నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు సామర్థ్యం సరిపోవడం లేదని.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఆటకు వీడ్కోలు పలికిన గౌతీ.. రాజకీయాల్లో ప్రవేశించి తూర్పు ఢిల్లీ ఎంపీగా ఎన్నికయ్యాడు.(ఐపీఎల్‌ వేలం 2020కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 2020 ఐపీఎల్‌ వేలంలో సొంతం చేసుకున్న ఆటగాళ్లు
►ప్యాట్‌ కమిన్స్‌    రూ. 15.5 కోట్లు
►మోర్గాన్‌    రూ. 5.25 కోట్లు
►వరుణ్‌ చక్రవర్తి    రూ. 4.0 కోట్లు
►టామ్‌ బాంటన్‌    రూ. 1.0 కోట్లు
►రాహుల్‌ త్రిపాఠి    రూ. 60 లక్షలు
►క్రిస్‌ గ్రీన్‌    రూ. 20 లక్షలు
►నిఖిల్‌ శంకర్‌     రూ. 20 లక్షలు
►ప్రవీణ్‌ తాంబే    రూ. 20 లక్షలు
►సిద్ధార్థ్‌    రూ. 20 లక్షలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top