రణతుంగకు సవాల్! | Sakshi
Sakshi News home page

రణతుంగకు సవాల్!

Published Sat, Jul 15 2017 12:36 PM

రణతుంగకు సవాల్!

ముంబై:దాదాపు ఆరేళ్ల క్రితం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన లంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగపై భారత సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన రణతుంగకు దాన్ని నిరూపించగలవా అంటూ విరుచుకుపడ్డ గంభీర్.. 'ఫిక్సింగ్' అంశానికి సంబంధించి ఆధారాలుంటే తీసుకురావాలంటూ సవాల్ విసిరాడు. 'రణతుంగ ఆరోపణలతో ఆశ్చర్యానికి గురయ్యా. అంతర్జాతీయ క్రికెట్ లో గౌరవప్రదమైన వ్యక్తి చేసే వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. రణతుంగా చేసిన కామెంట్స్ నిజంగా సీరియస్ వ్యాఖ్యలే. దీనికి రణతుంగా సమాధానం చెప్పక తప్పదు. ఆధారాలతో ఫిక్సింగ్ జరిగినట్లు నిరూపించు'అని గంభీర్ ఛాలెంజ్ చేశాడు.

మరొక సీనియర్ క్రికెటర్, ఆ వరల్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు ఆశిష్ నెహ్రా కూడా రణతుంగా వ్యాఖ్యలను ఖండించాడు. 'నేను రణతుంగా వ్యాఖ్యల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాగతించను. ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఎంతోకొంత విలువ ఉండాలి. ఈ తరహా స్టేట్మెంట్లకు ముగింపు ఎప్పుడు దొరుకుతుంది. ఇక్కడ 1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక జట్టును నేను ప్రశ్నించడం మంచి పద్ధతి అవుతుందా?, అనవసర వ్యాఖ్యల జోలికి వెళ్లడం  సమంజసం కాదు' అని నెహ్రా ధ్వజమెత్తాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement