కారు రేసింగ్‌ మధ్యలోకి బైక్‌.. దాంతో

Gaurav Gill Car Accident in Rajasthan Three People are Dead - Sakshi

బలంగా ఢీకొట్టిన రేసర్‌ గౌరవ్‌ గిల్‌ కారు

ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం

బర్మర్‌ (రాజస్థాన్‌): జాతీయ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో అనూహ్య దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ‘అర్జున అవార్డు’ అందుకున్న ప్రముఖ రేసింగ్‌ డ్రైవర్‌ గౌరవ్‌ గిల్‌ నడుపుతున్న కారు... ట్రాక్‌పైకి వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రేసింగ్‌ కారు దాదాపు 145 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది! దాంతో కారును అదుపు చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన గిల్, అతని సహచరుడు షరీఫ్‌లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడో రౌండ్‌ పోటీలను బర్మర్‌ వద్ద నిర్వహించారు.

సాధారణంగా ఇలాంటి రేసింగ్‌లను నిర్వహించినప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తాము తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ‘మా రేసింగ్‌కు పోలీసులతో పాటు సదరు గ్రామ పంచాయతీ అధికారుల అనుమతి ఉంది. సమీపంలోని గ్రామాల ప్రజలందరికీ 15 రోజుల ముందుగానే సమాచారం అందించాం. రోడ్లు మూసేస్తారని, రేసు రోజు తమ పెంపుడు జంతువులను కూడా అటు వైపు రానివ్వద్దని చెప్పాం. నిజానికి బైక్‌పై వచ్చిన వ్యక్తిని మా ఫీల్డ్‌ మార్షల్‌ అడ్డుకున్నాడు. అయితే అతడితో వాదనకు దిగి వద్దంటున్నా వినకుండా బ్యారికేడ్‌ను ఛేదించి ట్రాక్‌పై వెళ్లాడు. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ దారుణం చోటు చేసుకుంది’ అని రేసింగ్‌ ప్రమోటర్లు వెల్లడించారు. ఘటనపై పోలీసు విచారణ ప్రారంభమైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top