ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఆశలు

Franchises predict increase in viewership if IPL happens - Sakshi

ఏదో విధంగా లీగ్‌ నిర్వహించాలంటూ బీసీసీఐకి విజ్ఞాపనలు

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌ నిర్వహణ సాధ్యం అయ్యేలా లేదని ఆతిథ్య దేశం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై ఫ్రాంచైజీల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏదో విధంగా ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని పులువురు ఫ్రాంచైజీ యజమానులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయిలో లేదా కుదించైనా, భారత్‌లో కుదరకపోతే విదేశాల్లోనైనా లీగ్‌ను నిర్వహించడంపై బీసీసీఐ దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇటీవలే లీగ్‌ నిర్వహణపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించిన బీసీసీఐ, తదుపరి కార్యాచరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ నిర్వహణపై స్పష్టతనివ్వడంతో ఫ్రాంచైజీలన్నీ బీసీసీఐ వైపు ఆశగా చూస్తున్నాయి. లీగ్‌ పరిధి విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నారు. ‘పూర్తి స్థాయి లీగ్‌ నిర్వహించేందుకే బీసీసీఐ ప్రయత్నిస్తుంది అందులో సందేహం లేదు. కానీ సమయానుకూలతను బట్టి టోర్నీని కుదించినా మంచిదే. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణే సులభంగా ఉంటుంది. 2009లో కూడా కేవలం నెల వ్యవధిలో లీగ్‌ను దక్షిణాఫ్రికాకు తరలించాం. భారత్‌లో నిర్వహణ సాధ్యం కాకుంటే శ్రీలంక, న్యూజిలాండ్‌లో నిర్వహించవచ్చు.

ఒక్కసారి లీగ్‌పై ప్రకటన వస్తే స్పాన్సర్లు కూడా వారంతటవారే వస్తారు’ అని వాడియా అభిప్రాయపడ్డారు. మరోవైపు మైదానాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించకపోయినప్పటికీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్పాన్సర్లను ఆకట్టుకోవచ్చని చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. వ్యూయర్‌షిప్‌ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయ పడిన ఆయన... ఐపీఎల్‌ తేదీలు ప్రకటించాకే స్పాన్సర్లు ఫ్రాంచైజీలను సంప్రదిస్తారని అన్నారు. మరో ఫ్రాంచైజీకి చెందిన అధికారి మాట్లాడుతూ ఐపీ ఎల్‌ జరిగితే వ్యక్తిగత స్పాన్సర్‌షిప్‌ల కన్నా కూడా బీసీసీఐ సెంట్రల్‌ పూల్‌ ద్వారానే అధిక ఆదాయం పొందవచ్చని చెప్పాడు. ఆదాయం గురించి పక్కన పెడితే ఐపీఎల్‌ నిర్వహణకు సెప్టెంబర్‌–అక్టోబర్‌ తగిన సమయమని అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top