భారత్‌కు ఎదురుందా!

Fourth ODI against New Zealand today - Sakshi

మరో విజయంపై టీమిండియా దృష్టి

రోహిత్‌ శర్మ నాయకత్వంలో బరిలోకి

నేడు న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే 

పరువు కాపాడుకునే ప్రయత్నంలో కివీస్‌ 

ఉదయం గం.7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

ఐదేళ్ల క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఓడగా ఒక మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. కానీ ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత కూడా ఈసారి కివీస్‌ గడ్డపై భారత్‌ ప్రదర్శన ఇంత అద్భుతంగా, ఏకపక్షంగా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. సొంతగడ్డపై ప్రత్యర్థికి ఉండే బలం, పరిస్థితులువంటి ప్రతికూలతలను సునాయాసంగా అధిగమించిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకోగా... అటు స్వదేశంలో చేతులెత్తేసిన విలియమ్సన్‌ బృందం పరువు కాపాడుకోవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. తన 200వ వన్డేను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్న రోహిత్‌ నాయకత్వంలో భారత్‌ సిరీస్‌ స్కోరును 4–0గా మారుస్తుందో లేదో చూడాలి.   

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో తమ రెండో వన్డే సిరీస్‌ను గెలిచిన భారత్‌ ఆ రికార్డును మరింత ఘనంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. 2009లో ఇక్కడ సిరీస్‌ గెలిచినప్పుడు మూడు వన్డేలు నెగ్గిన టీమిండియా తొలిసారి సిరీస్‌లో నాలుగో విజయంపై కన్నేసింది. జట్టు ఫామ్‌ను బట్టి చూస్తే అదేమీ అసాధ్యం కాకపోవచ్చు. మరోవైపు న్యూజిలాండ్‌ ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య నేడు జరిగే నాలుగో వన్డే కివీస్‌కు కీలకంగా మారింది. సిరీస్‌ గెలిపించిన అనంతరం విరాట్‌ కోహ్లి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోగా... రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.  

గిల్‌ సందేహమే! 
తొలి మూడు వన్డేల్లో భారత జట్టు ఆటతీరు చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదు. అయితే కోహ్లి దూరం కావడంతో ఆ ఒక్క స్థానానికి ఖాళీ ఏర్పడింది. కోహ్లి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు పొందిన శుబ్‌మన్‌ గిల్‌ను మూడో స్థానంలో ఆడించే అవకాశం కనిపించింది. అయితే కండరాల గాయం నుంచి కోలుకున్న ధోని మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాడు. బుధవారం అతను పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. దినేశ్‌ కార్తీక్, రాయుడు కూడా తమ బాధ్యతను సమర్థంగా నెరవేరుస్తున్నారు. కాబట్టి కొత్త కుర్రాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకుంటే తప్ప గిల్‌కు చోటు దక్కదు. మార్పులు లేకపోతే రాయుడు మూడో స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ చెలరేగుతుండగా, మిగతా బ్యాట్స్‌మెన్‌లో జాదవ్‌ కూడా బాగా ఆడుతున్నాడు. పాండ్యా గత మ్యాచ్‌లో తన విలువేంటో చూపించాడు. ఇక స్పిన్‌ ద్వయం కుల్దీప్, చహల్‌ మరోసారి ప్రత్యర్థిని దెబ్బ తీసే వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. సిరీస్‌లో ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి 14 వికెట్లు పడగొట్టారు. పేసర్లు భువనేశ్వర్, షమీ చెలరేగిపోతున్నారు. వీరి లయను కొనసాగించాలని జట్టు భావిస్తే ఇద్దరికీ అవకాశం దక్కుతుంది. లేదా కుర్రాళ్లు ఖలీల్, సిరాజ్‌లలో ఒకరికి మరో అవకాశం ఇచ్చి ప్రయత్నించాలని భావిస్తే షమీకి విశ్రాంతి ఇవ్వవచ్చు. మొత్తంగా అందరూ మెరుగ్గా ఆడుతుండటంతో జట్టులో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.  

కివీస్‌ కష్టాలు తీరేనా... 
సొంతగడ్డపై తమ వన్డే చరిత్రలో న్యూజిలాండ్‌ మూడు సార్లు మాత్రమే ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరాభవం ముంగిట నిలిచింది. భారత జట్టు దూకుడుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో కివీస్‌ టీమ్‌ కనిపిస్తోంది. ఇప్పటి వరకు చూస్తే జట్టులో ఏ ఒక్కరు కూడా కనీసం రెండు మ్యాచ్‌లలోనైనా బాగా ఆడారని చెప్పలేం. విలియమ్సన్, టేలర్, లాథమ్‌ తలా ఒక అర్ధ సెంచరీ చేసినా అవి జట్టుకు ఉపయోగపడలేదు. ఓపెనింగ్‌ కూడా జట్టు ప్రధాన సమస్యగా మారింది. తమ ధాటి ప్రదర్శనతో సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తారని భావించిన గప్టిల్, మున్రోలు ఘోరంగా విఫలం కావడం జట్టును దెబ్బ తీస్తోంది. మిడిలార్డర్‌లో నికోల్స్‌ కూడా అదే తరహాలో విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఏ ఒక్కరి మీద జట్టు ఆధారపడలేకపోయింది. బ్యాటింగ్‌లో అందరూ సమష్టిగా రాణిస్తేనే జట్టు కోలుకోగలుగుతుంది. ముఖ్యంగా స్పిన్‌ ద్వయం కుల్దీప్, చహల్‌లను సమర్థంగా ఎదుర్కోవడంపైనే జట్టు విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. కివీస్‌ బౌలింగ్‌ కూడా ప్రభావవంతంగా లేదు. బౌల్ట్‌ తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోగా, బ్రేస్‌వెల్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ‘ఫాస్టెస్ట్‌’ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లోకీ ఫెర్గూసన్‌ భారత బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేకపోయాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన నీషమ్, టాడ్‌ ఆస్టల్‌లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇది గెలిస్తే కనీసం క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకునే అవకాశం కివీస్‌కు కలుగుతుంది.

విజయాలను అలవాటుగా మార్చుకున్న మేం అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాం. ప్రధాన జట్టంతా ప్రపంచ కప్‌కు సన్నద్ధమై ఉంది. అయితే రిజర్వ్‌ ఆటగాళ్లకు కూడా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మెగా టోర్నీలో అనుకోకుండా బరిలోకి దిగాల్సి వస్తే అప్పటికి తగిన మ్యాచ్‌ అనుభవం లేకపోతే కష్టం. అందుకే ఈవిషయంపై మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టింది. ఇంగ్లండ్‌ తరహా పరిస్థితులే న్యూజిలాండ్‌లో ఉంటాయి కాబట్టి మా ప్రపంచకప్‌ సన్నాహాలకు ఇది సరైన వేదిక. 
–ఆర్‌. శ్రీధర్, భారత ఫీల్డింగ్‌ కోచ్‌

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, కార్తీక్‌/గిల్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, చహల్‌.  
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, నీషమ్, సాన్‌ట్నర్, ఆస్టల్, ఫెర్గూసన్, బౌల్ట్‌. 

పిచ్, వాతావరణం  
సెడన్‌ పార్క్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. గత మూడు వన్డేల్లో 300 పరుగుల లోపు లక్ష్యాలను జట్లు సునాయాసంగా ఛేదించాయి. స్పిన్‌ ప్రభావం చూపిస్తుంది. వర్షంతో సమస్య లేదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top