50 లక్షల డాలర్లు చెల్లిస్తా

Former cycling superstar Lance Armstrong to pay USD 5 million - Sakshi

మాజీ సైక్లిస్ట్‌ లాన్స్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌  

లాస్‌ఏంజెల్స్‌: సైక్లింగ్‌ రేస్‌ టూర్‌ డి ఫ్రాన్స్‌ దిగ్గజం లాన్స్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన కేసులో 50 లక్షల డాలర్ల (రూ. 33 కోట్లు) జరిమానా చెల్లించేందుకు కోర్టులో అంగీకరించాడు. అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ తరఫున రేసుల్లో పాల్గొంటున్న సమయంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ డోప్‌ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీంతో ఆర్మ్‌స్ట్రాంగ్‌ తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని ఆరోపిస్తూ పోస్టల్‌ సర్వీస్‌ సంస్థ, మాజీ సహచరుడు ఫ్లాయిడ్‌ ల్యాండిస్‌లు అతడిపై 10 కోట్ల డాలర్లకు (రూ. 661 కోట్లు) కేసు వేశారు.

దీనికి సంబంధించి వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే... ఆర్మ్‌స్ట్రాంగ్‌ లాయర్ల అభ్యర్థన మేరకు పరిహారంపై ఒప్పందానికి రావాల్సిందిగా యూఎస్‌ న్యాయ విభాగం సూచించింది. దీంతో ఈ దిగ్గజ సైక్లిస్ట్‌ ఉపశమనం పొందినప్పటికీ... ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణమైన ల్యాండిస్‌ న్యాయ ఖర్చులకు మరో 10 లక్షల 65 వేల డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డోపింగ్‌తో కెరీర్‌ కోల్పోయిన ఆర్మ్‌స్ట్రాంగ్‌... కేసుల కారణంగా మరింత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌లోని తన ఇంటిని 75 లక్షల డాలర్లకు అమ్మకానికి పెట్టడమే దీనికి ఉదాహరణ. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top