వారే విఫలమైతే నా పరిస్థితి ఏమిటి? | Former All Rounder Vijay Bharadwaj Recalls 1999 Australia Tour | Sakshi
Sakshi News home page

వారే విఫలమైతే నా పరిస్థితి ఏమిటి?

Jun 26 2020 8:59 PM | Updated on Jun 26 2020 8:59 PM

Former All Rounder Vijay Bharadwaj Recalls 1999 Australia Tour - Sakshi

బెంగళూరు: కొంతమందికి కొన్ని క్రికెట్‌ పర్యటనలను అదృష్టాన్ని మోసుకొస్తే, మరి కొంతమందికి చేదు జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. అలా అంతర్జాతీయ క్రికెట్‌లో కెరీర్‌ బాధగా ముగించిన క్రికెటర్లలో విజయ్‌ భరద్వాజ్‌ ఒకడు. 1999లో కెన్యాలో జరిగిన ఎల్‌జీ కప్‌ ద్వారా దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక మాజీ ఆల్‌ రౌండర్‌.. తొలి టోర్నమెంట్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచాడు. 89 పరుగులు, 10 వికెట్లతో రాణించి  సత్తాచాటాడు. అయితే అదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుతో పాటు వెళ్లిన విజయ్‌ భరద్వాజ్‌ ఆ సిరీస్‌లో విఫలం కావడంతో అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. దీనిపై తాజాగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన విజయ్‌ భరద్వాజ్‌.. ఆనాటి చేదు జ్ఞాపకాల్ని మరొకసారి గుర్తు చేసుకున్నాడు.

ప్రధానంగా ఆ టెస్టు సిరీస్‌ను 0-3తేడాతో ఆసీస్‌కు కోల్పోవడంతో తన కెరీర్‌ ముగింపుకు బీజం పడిందన్నాడు. ఆ సిరీస్‌లో సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, గంగూలీలు విఫలమైన చోట తాను ఏదో అద్భుతం చేయాలనుకోవడం అత్యాశే అవుతుందన్నాడు. వారి విఫలమైతే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నాడు. ‘ ఆనాటి ఆస్ట్రేలియా పర్యటన చాలా అత్యంత కఠినమైనది. అంతకుముందు వరకూ నేనెప్పుడూ ఆస్ట్రేలియా పిచ్‌లు చూడలేదు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు రిజ‍ర్వ్‌ బెంచ్‌లోనే కూర్చొన్నా. ఆ రెండు టెస్టుల్లో అంతా విఫలమయ్యారు. ద్రవిడ్‌ యావరేజ్‌ 15 నుంచి 20 మధ్యలో ఉండగా, గంగూలీ కూడా అదే తరహాలో విఫలమయ్యాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా స్కోరు ఏమీ చేయలేదు. ఏ ఒక్క ఓపెనర్‌ సరైన స్కోరు చేయలేదు. మొత్తం జట్టంతా విఫలమైంది. మూడో టెస్టులో దిగిన నేను కూడా ఫెయిల్‌ అయ్యా. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న సచిన్‌కు ఏమి జరిగిందో అనే విషయం తెలుసుకునే లోపే సిరీస్‌ను సమర్పించుకున్నాం. నాకు ఆ మ్యాచ్‌లో వెన్నుముక గాయం అయ్యింది. దాంతో ఏడాదిన్నర జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఏమైందనే ఏ ఒక్కరూ అడగలేదు. అలా నా కెరీర్‌ క్రమంగా ముగిసింది’ అని విజయ్‌ భరద్వాజ్‌ తెలిపాడు. 1999లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన భరద్వాజ్‌- 2000లో చివరి టెస్టు ఆడాడు. కాగా, వన్డేల్లో మాత్రం 2002 వరకూ కొనసాగాడు. తన కెరీర్‌లో మూడు టెస్టులు, 10 వన్డేలను భరద్వాజ్‌ ఆడాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement