కప్పుకు ముందు కంగారూ సన్నాహం

Five ODI series against Australia - Sakshi

రేపటి నుంచి ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌

ప్రతిష్ఠాత్మక టోర్నీకి బలగాన్ని సమాయత్తం చేసే వీలు

హైదరాబాద్‌లో మ్యాచ్‌తో మొదలు

టెస్టుల్లో మెడలు వంచగలిగినా... టి20ల్లో మొత్తమ్మీద పై చేయిగా ఉన్నా... వన్డేల్లో టీమిండియాకు ఆస్ట్రేలియా కఠినమైన ప్రత్యర్థే! ఈ ఫార్మాట్‌లో కంగారూలు వారి గడ్డపైనే కాదు... భారత్‌లోనూ కొరుకుడుపడని వారే! స్వదేశంలో 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం చూపే మనకు... ఆసీస్‌ మాత్రం తేలిగ్గా తలొగ్గడం లేదు. రెండు జట్ల మధ్య భారత్‌లో 56 వన్డేలు జరిగితే ప్రత్యర్థి 26 గెలిచింది.

8 సిరీస్‌లలో చెరో 4 (ఇందులో గత మూడు సిరీస్‌లు భారత్‌వే) పంచుకున్నాయి. దీనిని బట్టే వారెంత పోటాపోటీగా ఆడతారో తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచ కప్‌ ముంగిట ఐదు వన్డేల సిరీస్‌కు తెరలేవబోతోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీకి సమాయత్తం అయ్యే క్రమంలో కోహ్లి సేనకిది చివరి అవకాశం. ఇక్కడ జయభేరి మోగిస్తే మంచి ఆత్మవిశ్వాసంతో సన్నాహాన్ని ప్రారంభించినట్లవుతుంది.

 సాక్షి క్రీడా విభాగం 
మన దేశంలో ఆడినా... వన్డేల్లో భారత్‌ కంటే ఆస్ట్రేలియా ఒక ఆకు ఎక్కువే చదివింది. కంగారూలు తమ పర్యటనల్లో ఇక్కడ 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్‌ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. పటిష్టంగా కనిపించిన టీమిండియాకు పలుసార్లు షాక్‌లిస్తూ ఆసీస్‌ సిరీస్‌లు ఎగరేసుకుపోయింది. అయితే, ఇదంతా గతం. ఇటీవల 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌ రాటుదేలగా, అదే సమయంలో ఆస్ట్రేలియా బలహీనపడింది. సొంతగడ్డ పైనే సిరీస్‌ కోల్పోయింది. దీంతో రెండు జట్ల మధ్య అంతరం పెరిగింది. పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేని టి20ల ఫలితాన్ని వదిలేస్తే... దాదాపు ప్రపంచ కప్‌లో పాల్గొనే ఆటగాళ్లందరితో బరిలో దిగుతున్నందున కోహ్లి సేననే రానున్న వన్డే సిరీస్‌లో ఫేవరెట్‌. మిగిలిందిక... ఇంగ్లండ్‌ బయల్దేరేందుకు సిద్ధం కావాల్సిన ఆ ఒకరిద్దరు ఎవరనేది తేల్చడమే. వారెవరో ఇక్కడే స్పష్టమవుతుందా? లేక మరింత కాలం ఆగాల్సి ఉంటుందా? 

తేలిపోయినట్టే(నా) 
పైకి చెప్పకున్నా, ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ద్వారా ప్రపంచ కప్‌నకు మన జట్టేమిటో అందరికీ స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. ఓపెనింగ్‌లో రోహిత్, ధావన్‌లకు బ్యాకప్‌గా రాహుల్, మిడిలార్డర్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్, కీపింగ్‌లో ధోనికి తోడుగా పంత్, పేస్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్, భువనేశ్వర్, బుమ్రా, షమీలతో పేస్‌ త్రయం, చహల్, కుల్దీప్‌ల స్పిన్‌ ద్వయంతో 15 స్థానాలూ భర్తీ అయినట్లే. వీరు కాక కప్‌ కోసం కొత్తగా చర్చకు వస్తున్న ఆటగాళ్ల పేర్లేవీ కూడా లేవు. ఈ ఐదు వన్డేల్లో వీరందరినీ పరీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఎవరైనా దారుణంగా విఫలమైతేనో, దురదృష్టవశాత్తూ గాయపడితేనో తప్ప వేరొకరి ఎంపిక గురించి ఆలోచన రాకపోవచ్చు. 

అతడి గాయం... ఇతడికి వరం 
ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం తీవ్రత ఏమిటో త్వరలో తేలనుంది. బ్యాటింగ్‌లో, పేస్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌లో బాగా పనికొస్తాడనుకున్న అతడు ఆసీస్‌తో సిరీస్‌కు దూరమవడం విజయ్‌ శంకర్‌కు ఓ విధంగా మరింత మేలు చేసింది. న్యూజిలాండ్‌లో టి20ల్లో నిరూపించుకున్న శంకర్‌... కంగారూలపై వన్డేల్లోనూ రాణిస్తే వ్యక్తిగతంగా అతడికి భారీ ఉపయోగం. జట్టుకూ ఊరట దక్కుతుంది. హార్దిక్‌ ఫిట్‌నెస్‌ అటుఇటుగా ఉన్నందున శంకర్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సిన ఈ అవకాశాన్ని తమిళనాడు ఆల్‌రౌండర్‌ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. 

వీరు ఆటలో అరటిపండ్లే... 
హార్దిక్‌ స్థానంలో రవీంద్ర జడేజాను వన్డేలకు ఎంపిక చేసినా, భువనేశ్వర్‌ బదులుగా తొలి రెండు మ్యాచ్‌లకు సిద్ధార్థ్‌ కౌల్‌ను తీసుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరి ప్రపంచ కప్‌ ఊహలు ఊహలుగానే భావించాలి. పాండ్యా పూర్తిగా కోలుకోకపోయినా జడేజాకు మాత్రం ఇంగ్లండ్‌ అవకాశాలు దాదాపుగా లేవు. ఇక ముందునుంచే రేసులో లేని కౌల్‌... రెండో టి20లో తేలిపోయి మరింత వెనుకబడ్డాడు. మొదటి రెండు వన్డేలకు జట్టులో ఉన్నా, మైదానంలోకి దిగుతాడని కూడా చెప్పలేం. 

ఆడుకో రాహుల్‌... అందుకో భువీ 
ప్రపంచ కప్‌ జట్టులో ఉంటారని భావిస్తున్న ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్‌ను మరింత బాగా ఉపయోగించుకోవాల్సి ఉంది. అందులో మొదటివాడు రాహుల్‌. నిషేధం ప్రభావం, ఫామ్‌ లేమి నుంచి ఒకేసారి బయటపడిన అతడు టి20ల్లో అదరగొట్టాడు. వన్డేల్లోనూ ఆ జోరు కొనసాగిస్తే రాహుల్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపవడం ఖాయం. ఇక రెండో ఆటగాడు భువనేశ్వర్‌. తనదైన స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే భువీ... ఆసీస్, న్యూజిలాండ్‌ పర్యటనల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కావాల్సినంత విశ్రాంతితో మూడో వన్డే నుంచి బరిలో దిగుతున్నందున ఈ మీరట్‌ పేసర్‌ తన పదును చూపాలి. పనిలో పనిగా... టి20ల్లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేక పోయిన స్పిన్నర్‌ చహల్‌ సైతం తన బౌలింగ్‌ లోపాలను సరిచేసుకోవాలి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top