ఢిల్లీలోనే తొలి టి20

First T20 Match Will Be In Delhi Says Sourav Ganguly - Sakshi

కోల్‌కతా: ఢిల్లీ నగరాన్ని కాలుష్యం పీడిస్తున్నప్పటికీ షెడ్యూలు ప్రకారం తొలి టి20 అక్కడే జరుగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. అయితే భవిష్యత్తులో దీపావళి తర్వాత ఢిల్లీ వేదికపై మ్యాచ్‌లు జరగకుండా చూసుకుంటామని చెప్పాడు. ఈ నెల 3న న్యూఢిల్లీలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మొదటి టి20 జరుగనున్న సంగతి తెలిసిందే. ‘అంతా పూర్తయ్యాక ఆఖర్లో మార్పులంటే కుదరదు. ఇప్పటికే ఢిల్లీ మ్యాచ్‌ కోసం టికెట్ల విక్రయం, నిర్వహణ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. కాబట్టి మ్యాచ్‌ను రద్దు చేయడం అసాధ్యం. అయితే భవిష్యత్తులో ఉత్తర భారత వేదికలపై దీపావళి తర్వాత మ్యాచ్‌లు లేకుండా చూసుకుంటాం.

దీనిపై మరింత కసరత్తు చేస్తాం. ఢిల్లీతో పాటు హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని వేదికలకు మ్యాచ్‌లు కేటాయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’ అని గంగూలీ అన్నాడు. దీపావళి తర్వాత ఉత్తర భారత్‌లో ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే ఇదని... అయితే మ్యాచ్‌ రోజుకల్లా పరిస్థితుల్లో మార్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు దాదా చెప్పాడు. భారత తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ విపరీతమైన వాయు కాలుష్యంతో తనకెలాంటి సమస్య లేదన్నాడు. గురువారం బంగ్లా ఆటగాళ్లు మాస్క్‌ ధరించి నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. లిటన్‌ దాస్‌ కాసేపు మాస్క్‌తో కనిపించినప్పటికీ తర్వాత బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌లో మాత్రం మాస్క్‌ తీసి ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top