
మార్గావ్ (గోవా): ఫిఫా అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇరాన్ కుర్రాళ్ల జోరు ప్రిక్వార్టర్స్‌లోనూ కొనసాగింది. ఈ టోర్నీలో పరాజయమన్నదే ఎరుగని ఇరాన్ తాజాగా 2–1 స్కోరుతో మెక్సికోను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన ఇతర ప్రిక్వార్టర్స్‌లో గెలుపొందిన స్పెయిన్, ఇంగ్లండ్, మాలి జట్లు కూడా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాయి. గోవాలో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ ఆట ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మైదానంలో ప్రత్యర్థి మెక్సికో రక్షణ శ్రేణి పేలవమైన ఆటతీరును సొమ్ము చేసుకున్న ఇరాన్ ఆటగాళ్లు మొహమ్మద్ షరిఫి (7వ ని.), అల్లాయర్ సయ్యద్ (11వ ని.) చెరో గోల్ చేశారు. మరోవైపు ఇరాన్ డిఫెండర్లతో పాటు, గోల్ కీపర్ అలీ ఘోలమ్ అంతే దీటుగా స్పందించడంతో గోల్‌పోస్ట్‌పై మెక్సికో చేసిన దాడులన్నీ నిష్ఫలమయ్యాయి.
అయితే తొలి అర్ధభాగం ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు రాబెర్టొ డి లా రొసా (37వ ని.) చేసిన గోల్‌తో మెక్సికో... ఇరాన్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. ద్వితీయార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. దీంతో 2–1తో ఇరాన్ ముందంజ వేసింది. గువాహటిలో జరిగిన మరో ప్రిక్వార్టర్స్‌లో చివరి నిమిషంలో చేసిన గోల్‌తో స్పెయిన్ 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. స్పెయిన్ తరఫున జువన్ మిరండ (44వ ని.), అబెల్ రూయిజ్ (90వ ని.) చెరో గోల్ సాధించగా, ఫ్రాన్స్ జట్టులో లెన్నీ పింటొర్ (34వ ని.) గోల్ చేశాడు. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పెనాల్టీ షూటౌట్‌లో 5–3తో జపాన్‌పై విజయం సాధించింది. గోవాలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాలి 5–1తో ఇరాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు (బుధవారం) జరిగే రెండు ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఘనాతో నైజర్, బ్రెజిల్‌తో హోండూరస్ తలపడతాయి.