వన్డేల్లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఓపెనర్‌

Fakhar Zaman Hits Double Century Against Zimbabwe - Sakshi

బులవాయో : జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్ ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా పాక్‌ ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్‌లు నిలిచారు. తొలి వికెట్‌కు 304 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన పాక్‌ ఓపెనర్లు.. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్‌ భాగస్వామ్యాన్ని బద్ధలుకొట్టారు. 2006లో ఇంగ్లండ్‌పై లీడ్స్‌లో జరిగిన వన్డేలో లంక ఓపెనర్లు ఆ ఫీట్‌ నమోదు చేశారు. కాగా, నేడు 304 పరుగుల వద్ద సెంచరీ వీరుడు ఇమాముల్‌ హక్‌ (113: 122 బంతుల్లో 8 ఫోర్లు) ఔటైన తర్వాత జమాన్‌ మరింతగా చెలరేగిపోయాడు.

ఈ క్రమంలో ఫఖర్‌ జమాన్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి పాక్‌ క్రికెటర్‌గా జమాన్‌ (210 నాటౌట్‌; 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లు) నిలిచాడు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్‌లో ద్విశతకాన్ని బాదిన ఆరో క్రికెటర్ జమాన్‌. వన్‌డౌన్‌ క్రికెటర్‌ అసిఫ్‌ అలీ (50 నాటౌట్‌; 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకం చేయడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లాడి కేవలం వికెట్‌ నష్టపోయి 399 పరుగులు సాధించింది. జింబాబ్వేకు 400 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఫఖర్‌ జమాన్‌ కంటే ముందు టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలతో పాటు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్, వెస్టిండీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌గేల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 

నాలుగో వన్డేలోనూ జింబాబ్వే చిత్తు!
400 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జింబాబ్వే ఈ మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమైంది. పాక్‌ బౌలర్‌ షాదబ్‌ ఖాన్‌ (4/28) చెలరేగడంతో 42.4 ఓవర్లాడిన జింబాబ్వే కేవలం 155 పరుగులకే చాపచుట్టేసింది.  దీంతో నాలుగో వన్డేలో పాక్‌ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ట్రిపానో (44), చిగుంబురా (37), పరవాలేదనిపించారు. ఓపెనర్‌ మసకద్జ (22), పీజే మూర్‌ (20) పరుగులు చేయగా, ఇతర బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో సిరీస్‌లో మరో దారుణ ఓటమి చవిచూసింది. నాలుగు వన్డేలు నెగ్గిన పాక్‌ చివరి మ్యాచ్‌లోనూ నెగ్గి 5-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది.

  • ఫఖర్‌ జమాన్‌(210 నాటౌట్‌)కు ముందు ఓ వన్డేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన పాక్‌ క్రికెటర్‌గా సయీద్‌ అన్వర్‌ (194 పరుగులు) ఉన్నాడు. 1997లో భారత్‌పై అన్వర్‌ ఈ ఇన్నింగ్స్‌ ఆడాడు.
  • తాజా మ్యాచ్‌లో మరో రికార్డు కూడా బద్దలైంది. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని జమాన్-ఇమాముల్ హక్‌లు బద్దలుగొట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 304 పరుగులు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top