భారత్‌ జోరుకు బ్రేక్‌ | England to crushing win over India in second ODI | Sakshi
Sakshi News home page

భారత్‌ జోరుకు బ్రేక్‌

Jul 15 2018 1:19 AM | Updated on Jul 15 2018 11:38 AM

England to crushing win over India in second ODI - Sakshi

లండన్‌: ఈసారి ఇంగ్లండ్‌ వంతు. ముందు బ్యాటింగ్‌లో గర్జించింది. తర్వాత బౌలింగ్‌లో బెంబేలెత్తించింది. భారత్‌ జోరుకు బ్రేక్‌ వేసింది. చివరకు రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 86 పరుగుల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. మూడు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జో రూట్‌ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్‌) మోర్గాన్‌ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్‌), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కుల్దీప్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులే చేసి ఆలౌటైంది. కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్‌) పరువు నిలిచే స్కోరు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ప్లంకెట్‌కు 4 వికెట్లు దక్కాయి. రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. చివరి వన్డే 17న లీడ్స్‌లో జరగనుంది. 

ఓపెనర్ల శుభారంభం... 
టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (42 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), బెయిర్‌ స్టో (31 బంతుల్లో 38; 5 ఫోర్లు 1 సిక్స్‌) గత వన్డేలాగే శుభారంభం అందించారు. ఉమేశ్‌ తొలి ఓవర్‌ తొలి బంతికి బౌండరీతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జేసన్‌ రాయ్‌ పేసర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. బెయిర్‌ స్టో కూడా యథేచ్ఛగా షాట్లు ఆడటంతో స్కోరు బోర్డు ఓవర్‌కు ఆరు పరుగులు చొప్పున కదిలింది. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. ఈ దశలో కోహ్లి... కుల్దీప్‌ యాదవ్‌కు బంతి అప్పగించాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ 11వ ఓవర్‌ రెండో బంతికే బెయిర్‌ స్టోను బోల్తా కొట్టించాడు. స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించగా బంతి అతని ప్యాడ్లను తాకుతూ వెళ్లి లెగ్‌ స్టంప్‌ను పడేసింది. దీంతో 69 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జేసన్‌కు జో రూట్‌ జతయ్యాడు. కానీ స్వల్ప వ్యవధిలోనే కుల్దీప్‌... జేసన్‌ వికెట్‌ను చేజిక్కించుకున్నాడు. మిడ్‌వికెట్‌ మీదుగా భారీషాట్‌కు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఉమేశ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ దశలో వచ్చిన మోర్గాన్, రూట్‌  జాగ్రత్తగా ఆడారు. ఇద్దరు క్రీజులో క్రమంగా పాతుకుపోవడంతో భారత బౌలర్లకు కష్టాలు తప్పలేదు. చూస్తుండగానే జట్టు స్కోరు 150కి చేరింది. రూట్‌ 56 బంతుల్లో (4 ఫోర్లు), మోర్గాన్‌ 49 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాక జట్టు స్కోరు 189 పరుగుల వద్ద మోర్గాన్‌ను కుల్దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వచ్చిన స్టోక్స్‌ (5), బట్లర్‌ (4) విఫలమయ్యారు. స్టోక్స్‌ను హార్దిక్‌ పాండ్యా, బట్లర్‌ను ఉమేశ్‌ ఔట్‌ చేశారు. మొయిన్‌ అలీ (13) కాసేపు నిలిచినా... చహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 239 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన విల్లే అండతో రూట్‌ 109 బంతుల్లో (8 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది 12వ సెంచరీ. విల్లే దాటిగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకుంది. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసిన 46వ ఓవర్లో విల్లే ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఉమేశ్‌ వేసిన మరుసటి ఓవర్లో రెండు బౌండరీలు కొట్టిన విల్లే...అర్ధసెంచరీకి చేరువయ్యాడు.  హార్దిక్‌ పాండ్యా వేసిన 48వ ఓవర్లో విల్లే ఫోర్, రూట్‌ భారీ సిక్సర్‌ బాదాడు. విల్లే 30 బంతుల్లోనే (5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేశాడు. ఇద్దరు అబేధ్యమైన ఏడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. చహల్, పాండ్యా, ఉమేశ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 

భారత్‌కు దెబ్బ మీద దెబ్బ... 
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (26 బంతుల్లో 15; 2 ఫోర్లు), ధావన్‌ (30 బంతుల్లో 36; 6 ఫోర్లు) ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ మొదలెట్టారు. అడపాదడపా బౌండరీలతో శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోష్‌ ఎక్కువసేపు నిలువలేదు. 8 ఓవర్ల దాకా బాగానే ఆడిన ఓపెనర్లిద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించడం ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. మార్క్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో రోహిత్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 49 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. విల్లే వేసిన మరుసటి ఓవర్లోనే ధావన్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. అతను బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. తదుపరి ఓవర్లో లోకేశ్‌ రాహుల్‌ ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. ప్లంకెట్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టడంతో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాడు. కేవలం 11 పరుగుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కోహ్లి, రైనా కాసేపు నిలబడినప్పటికీ అది భారీస్కోరుకు ఏ మాత్రం సరిపోలేదు. నాలుగో వికెట్‌కు 80 పరుగులు జతయ్యాక కోహ్లి... మొయిన్‌ అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో క్రీజులోకి ధోని వచ్చాడు. 31వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. కాసేపటికే రైనా రూపంలో భారత్‌ మరో దెబ్బ తగిలింది. అతన్ని రషీద్‌ బౌల్డ్‌ చేశాడు. 154 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయిన భారత్‌ ఇక లక్ష్యం కోసం కాకుండా పరువు కోసం ఆడాల్సి వచ్చింది. 21 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యాను ప్లంకెట్‌ ఔట్‌ చేయగా, ఉమేశ్‌యాదవ్‌ (0) రషీద్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ధోని (59 బంతుల్లో 37; 2 ఫోర్లు ) చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. అతను ఔటయ్యాక కుల్దీప్‌ (8 నాటౌట్‌), చహల్‌ (12) కాసేపు ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. చహల్‌ ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతికి ఔట్‌ కావడంతో భారత్‌ 236 పరుగుల వద్ద ఆలౌటైంది. రషీద్, విల్లే రెండేసి వికెట్లు తీశారు. 

ధోని... పది వేల క్లబ్‌లో...
మాజీ కెప్టెన్‌ ధోని మరో మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 33 పరుగుల వద్ద ఈ మైలురాయి చేరాడు. ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అతను 12వ స్థానంలో ఉన్నాడు. అంతకుముందు 300 క్యాచ్‌ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనతెక్కిన నాలుగో వికెట్‌ కీపర్‌గా ధోని నిలిచాడు. గిల్‌క్రిస్ట్‌ (417), బౌచర్‌ (403), సంగక్కర (402) ముందు వరుసలో ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement