పొరపాటు పడకోయి!

Do not repeat mistakes on England  - Sakshi

ఇంగ్లండ్‌ గడ్డపై తప్పులు పునరావృతం కావొద్దు

తుది జట్టు ఎంపికలో  వివేకం అవసరం

లోపాలు దిద్దుకుంటేనే విజయానికి మార్గాలు  

టి20ల మజా అయిపోయింది. వన్డేల పోరాటం ముగిసింది. సన్నాహం కూడా సమాప్తమైంది. ఇంగ్లిష్‌ వాతావరణమూ అలవాటైంది. ఇక ముందున్నది అసలు పరీక్ష! కంగుతినిపించే స్వింగ్‌... కొరుకుడుపడని బ్యాట్స్‌మెన్‌... ఓపికను పరీక్షించే టెయిలెండర్లు... ఓ పట్టాన చిక్కని విజయం... మన సత్తా తేల్చే సిసలైన సిరీస్‌! ఐదు టెస్టుల సుదీర్ఘ ప్రయాణంలో నెగ్గాలంటే టీమిండియా ఏం చేయాలి? విరాట్‌ కోహ్లి సేన సరిదిద్దుకోవాల్సిన లోపాలేంటి? మెరుగుపడాల్సిన అంశాలపై విశ్లేషణ!          

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత విదేశీ గడ్డపై భారత క్రికెట్‌ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. యాదృచ్ఛికమైనా చివరిసారిగా తలపడింది కూడా ఇంగ్లండ్‌తోనే కావడం గమనార్హం. పటౌడీ ట్రోఫీ పేరిట 2014లో జరిగిన ఆ సిరీస్‌లో టీమిండియా 1–3 తేడాతో పరాజయం పాలైంది. అయితే, అదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ సందర్భంగా ధోని నుంచి కోహ్లి చేతికి సారథ్య బాధ్యతలు వచ్చాయి. ఆ తర్వాతే జట్టు దృక్పథం మారింది. గెలుపే ముఖ్యమని భావిస్తూ, ఆ మేరకు సహచరులనూ సమాయత్తం చేసే కోహ్లి నాయకత్వంలో విదేశాల్లోనూ ప్రతిఘటన పెరిగింది. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనే ఇందుకు సరైన నిదర్శనం. కానీ, కొన్ని పొరపాట్ల కారణంగా ఆ సిరీస్‌ చేజారింది. అవి పునరావృతం కాకుండా చూసుకుంటే, పదకొండేళ్ల అనంతరం ఇంగ్లండ్‌లో సిరీస్‌ నెగ్గి, చరిత్రలో నిలిచే అవకాశం దక్కుతుంది. మరి చేయకూడని ఆ పొరపాట్లేమిటో చూద్దామా? 

తుది జట్టు ఎంపిక
‘ఫామ్‌ ఆధారంగా రోహిత్‌ను ఎంపిక చేశాం’.., ‘రోహిత్‌ విఫలమైతే రహానేను ఎందుకు ఆడించలేదంటారు... రహానే విఫలమైతే రోహిత్‌ను ఎందుకు తీసుకోలేదంటారు’ ఇవి దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యలు. ఇదే సిరీస్‌లో మొదటి టెస్టులో ఆల్‌రౌండ్‌ షో చూపిన భువనేశ్వర్‌ను అనూహ్యంగా రెండో టెస్టుకు తప్పించారు. సరైన తుది జట్టు ఎంపిక లోపాన్ని చాటే ఇలాంటి నిర్ణయాలతో మిగిలేది ఓటమే. వేర్వేరు కారణాలతో ప్రస్తుతం ఇలాంటి సమస్య లేకున్నా... సరైన కూర్పు విజయానికి తొలి మెట్టుగా భావించి బరిలో దిగాలి. 

వికెట్ల వెనుక కాదు... ముందు
స్వదేశంలో సాహా, పార్థివ్‌ పటేల్, దినేశ్‌ కార్తీక్‌ ఇలా వికెట్‌ కీపర్‌ ఎవరైనా వారి బ్యాటింగ్‌ సామర్థ్యం పెద్దగా చర్చకు రాదు. కానీ, విదేశాల్లో మన కీపర్ల బ్యాటింగ్‌ ప్రతిభ అంతంతే. ఈ నాలుగేళ్లలో విదేశాల్లో జట్టు స్కోరులో కీపర్ల వాటా 12.37 శాతం కావడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు సాహా లేడు, మంచి బ్యాట్స్‌మన్‌ అయిన దినేశ్‌ కార్తీక్‌కు చక్కని అవకాశం దక్కింది. చిత్రమేమంటే, తన కెరీర్‌ తొలినాళ్లలో, భారత్‌ 1–0తో నెగ్గిన 2007 సిరీస్‌లో కార్తీకే (263) టాప్‌ స్కోరర్‌. ప్రస్తుతం అతడు అన్ని విధాలా మెరుగ్గా ఉన్నాడు. కీపింగ్‌తో పాటు బ్యాట్‌తోనూ ఓ చేయి వస్తే జట్టుకు అదనపు ప్రయోజనం చేకూర్చిన వాడవుతాడు. 

రహానేను తప్పించొద్దు
కేఎల్‌ రాహుల్‌ను ఆడిద్దామనో, అదనపు పేసర్‌కు చోటిచ్చేందుకో రహానే వంటి ఆటగాడిని పక్కనపెడదామన్న ఆలోచనే సమర్థనీయం కాదు. జొహన్నెస్‌బర్గ్‌ టెస్టు ఈ విషయం చాటింది. పైగా ఇంగ్లండ్‌పై 2014లో లార్డ్స్‌ టెస్టులో పచ్చిక పిచ్‌పై టెయిలెండర్లతో బండి లాగించిన రహానే శతకం కొట్టాడు. విదేశాల్లో (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా) కోహ్లి (52.11) తర్వాత అత్యధిక సగటు రహానేదే (46.91). దీనిని దృష్టిలో పెట్టుకునైనా తన జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. 

స్పిన్‌ను వదలొద్దు
పేస్‌ పిచ్‌లపై తక్కువ స్కోర్ల మ్యాచ్‌ల్లోనో, భారీ స్కోర్లు సాధించాక స్పిన్నర్లు ప్రత్యర్థిని చుట్టేసిన సందర్భాల్లోనో టీమిండియాకు విదేశాల్లో టెస్టు విజయాలు దక్కుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై మన జట్టు నెగ్గిన మూడు టెస్టు ల్లోనూ స్పిన్నర్ల పాత్రే ఎక్కువ కావడం విశేషం. గతం లోలా జూన్, జూలైల్లో కాకుండా ప్రస్తుతం ఆగస్టు, సెప్టెంబర్‌లో మ్యాచ్‌లు జరుగనుండటంతో పొడిగా మారిన పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించొచ్చు. కాబట్టి ఇద్దరు స్పిన్నర్ల  వ్యూహమే సరైనది.  

విజయ్‌–పుజారా
ప్రస్తుత తరంలో అసలైన టెస్టు ఆటగాళ్లు ఈ ఇద్దరు. పరుగులు రాకున్నా... వీరు క్రీజులో పాతుకుపోతే తద్వారా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కోహ్లి, రహానేలకు కొత్త బంతిని ఎదుర్కొనే ఇబ్బంది తప్పుతుంది. షాట్‌కు వీలుకాని బంతి అని ఏమాత్రం అనిపించినా వదిలేయడం విజయ్‌ లక్షణమైతే, చెక్కుచెదరని డిఫెన్స్‌ పుజారా సొంతం. గత సిరీస్‌లో మాత్రం విజయ్‌ శైలికి భిన్నంగా తక్కువ సంఖ్యలో (35.59 శాతం) బంతులను వదిలేశాడు. భిన్నమైన షాట్లు ఆడి వికెట్‌ ఇచ్చుకున్నాడు. ఈసారి అతడితోపాటు పుజారా దుర్భేద్య గోడ కడితే జట్టుకు అదే పదివేలు. 

స్లిప్‌ క్యాచింగ్‌ 
క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయనేది క్రికెట్‌ నానుడి. నేటి పరిస్థితుల్లో ఇది టెస్టులకే సరిగ్గా వర్తిస్తుంది. ముఖ్యంగా స్వింగ్‌ రాజ్యమేలే ఇంగ్లండ్‌లో. ఇందులో ‘స్లిప్‌’ ఏరియా గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ద్రవిడ్, లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ అనంతరం భారత ‘స్లిప్‌’ బృందం మారింది. కెప్టెన్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రహానే ఆ స్థానాల్లోకి వచ్చారు. తోడుగా మురళీ విజయ్‌. అయితే క్యాచింగ్‌ గణాంకాలు మాత్రం గొప్పగా లేవు. 2013 చివరి నుంచి పేసర్ల బౌలింగ్‌లో 46 క్యాచ్‌లు మిస్‌ చేయగా... పట్టింది 38 మాత్రమే. సఫారీలపై కేప్‌టౌన్‌లో తొలి టెస్టులో టెయిలెండర్‌ కేశవ్‌ మహరాజ్‌ (35 పరుగులు) సున్నా వద్ద ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడం మ్యాచ్‌నే చేజారేలా చేసింది. ఇదే సిరీస్‌ మూడో టెస్టులో కోహ్లి ఇచ్చిన రెండు క్యాచ్‌లను దక్షిణాఫ్రికా ఫీల్డర్లు అందుకోలేకపోయారు. మరోవైపు అన్నింటిని ఒడిసిపట్టిన భారత్‌... జయకేతనం ఎగురవేయడం గమనార్హం. 

సీమర్ల భారం తగ్గించాలి 
ఆడనున్నది ఐదు టెస్టుల సిరీస్‌. గరిష్టంగా 25 రోజులు మైదానంలో ఉండాలి.  మధ్యలో నాలుగు రోజులు ప్రయాణం. విశ్రాంతి 13 రోజులే. ఇక మొదటి, రెండో టెస్టులకైతే పెద్దగా విరామమే లేదు. కాబట్టి ఇషాంత్, ఉమేశ్, షమీలపై ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి. కనీసం రెండు టెస్టుల వరకు వీరిని కాపాడుకుంటే తర్వాత బుమ్రా, భువనేశ్వర్‌ చేరికతో ఉపశమనం దక్కే అవకాశం ఉంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top