జొకోవిచ్‌ జైత్రయాత్ర  | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ జైత్రయాత్ర 

Published Tue, Sep 11 2018 1:06 AM

 Djokovic up to No. 3, Osaka at No. 7 after US Open titles - Sakshi

గత రెండేళ్లలో ఫామ్‌ కోల్పోయి ఒకదశలో ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ పూర్వ వైభవం దిశగా సాగుతున్నాడు. ఈ ఏడాది వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచి గాడిలో పడ్డ అతను తాజాగా సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచాడు. తనలో ఆట ఇంకా చాలా మిగిలి ఉందని చాటి చెప్పాడు. మండే ఎండలు, తీవ్రమైన ఉక్కపోత కారణంగా ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో పలువురు మ్యాచ్‌ మధ్యలోనే వైదొలగగా... ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని, పటిష్టమైన ప్రత్యర్థులను బోల్తా కొట్టించి జొకోవిచ్‌ ఈ టోర్నీలో ఎదురులేని విజేతగా నిలిచాడు.   

న్యూయార్క్‌: తొలి రౌండ్‌లో మొదలైన జోరును ఫైనల్లోనూ కొనసాగించిన సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మూడోసారి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 7–6 (7/4), 6–3తో మూడో సీడ్‌ యువాన్‌ మార్టిన్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలుపొందాడు. విజేత జొకోవిచ్‌కు 38 లక్షల డాలర్లు (రూ. 27 కోట్ల 40 లక్షలు); రన్నరప్‌ డెల్‌పొట్రోకు 18 లక్షల 50 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ ఆడిన 31 ఏళ్ల జొకోవిచ్‌కు తుదిపోరులో తన ప్రత్యర్థి నుంచి అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 3 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌తొలి సెట్‌లోని ఏడో గేమ్‌లో డెల్‌పొట్రో సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 6–3తో దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌లను చేజార్చుకున్నారు. చివరకు టైబ్రేక్‌లో జొకోవిచ్‌ ఈ సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్‌లోని నాలుగో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో డెల్‌పొట్రో సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.  

►అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్‌ మూడో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో అతను పీట్‌ సంప్రాస్‌ (అమెరికా)తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్‌ (20), రాఫెల్‌ నాదల్‌ (17) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

►ఒకే ఏడాది వరుసగా వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలవడం జొకోవిచ్‌కిది మూడోసారి. 2011, 2015లలో కూడా అతను ‘డబుల్‌’ సాధించాడు. ఫెడరర్‌ అత్యధికంగా నాలుగుసార్లు (2004, 05, 06, 07లలో) ఈ ఫీట్‌ సాధించాడు.  

►ఓపెన్‌ శకంలో (1968 తర్వాత) యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ఏడో ప్లేయర్‌ జొకోవిచ్‌. ఈ జాబితాలో ఫెడరర్, జిమ్మీ కానర్స్, పీట్‌ సంప్రాస్‌ (5 సార్లు చొప్పున), జాన్‌ మెకన్రో (4 సార్లు), ఇవాన్‌ లెండిల్, రాఫెల్‌ నాదల్‌ (3 సార్లు చొప్పున) ఉన్నారు.  

తాజా గ్రాండ్‌స్లామ్‌   టైటిల్‌తో పీట్‌ సంప్రాస్‌ సరసన చేరినందుకు ఆనందంగా ఉంది. అతను నా చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు. టీవీలో సంప్రాస్‌ వింబుల్డన్‌లో ఆడుతున్నపుడు చూసి నేను ఈ క్రీడవైపు మళ్లాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోచేతికి శస్త్రచికిత్స జరిగాక వింబుల్డన్, సిన్సినాటి మాస్టర్స్‌ సిరీస్, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించానంటే నాకే నమ్మశక్యంగా లేదు.
–జొకోవిచ్‌  

Advertisement

తప్పక చదవండి

Advertisement