ఫుల్‌ చార్జింగ్‌... 

Deccan Chargers ipl winner in 2009 - Sakshi

2009లో విజేతగా నిలిచిన దక్కన్‌ చార్జర్స్‌ 

మరో 10 రోజుల్లో ఐపీఎల్‌  

తొలి ఐపీఎల్‌లో చివరి స్థానాల్లో నిలిచిన రెండు జట్లు మరుసటి ఏడాదే ఫైనల్లో తలపడటం 2009 ఐపీఎల్‌కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషం. గిల్‌క్రిస్ట్‌ నాయకత్వంలోని హైదరాబాద్‌ టీమ్‌ డెక్కన్‌ చార్జర్స్‌ విజేతగా నిలిచింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాకు తరలించడంతో ఇండియన్‌ లీగ్‌ కాస్తా ‘సఫారీ లీగ్‌’గా మారిపోయింది. ఈ టోర్నీ లో తొలిసారి ఒక్కో ఇన్నింగ్స్‌లో పది ఓవర్ల తర్వాత ఏడున్నర నిమిషాల టైమ్‌ ఔట్‌ విరామ నిబంధనను తెచ్చారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ టోర్నీ విశేషాలను చూస్తే... 

కుంబ్లే శ్రమ వృథా... 
జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్లో చార్జర్స్‌ 6 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. తొలుత చార్జర్స్‌ 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కుంబ్లే 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు 9 వికెట్లకు 137 పరుగులే చేసింది.    

వివాదం... 
అతి చెత్త ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈసారి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే దానికంటే ‘ఫేక్‌ ఐపీఎల్‌ ప్లేయర్‌’ పేరుతో బ్లాగ్‌లో వచ్చిన కథనాలు వివాదం రేపాయి. టీమ్‌ లోగుట్టు విషయాలు ఇందులో బయటకు వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి టోర్నీ మధ్యలోనే పంపించిన ఆకాశ్‌ చోప్రా, సంజయ్‌ బంగర్‌లు దీని వెనక ఉన్నారని వినిపించింది. లీగ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. బెంగళూరు తరఫున మనీశ్‌ పాండే 114 నాటౌట్‌ పరుగులు చేయగా, ఢిల్లీ తరఫున డివిలియర్స్‌ 105 నాటౌట్‌ పరుగులు చేశాడు.  

వీరు గుర్తున్నారా!  
దక్కన్‌ చార్జర్స్‌ విన్నింగ్‌ టీమ్‌లో గిల్‌క్రిస్ట్, సైమండ్స్, గిబ్స్, వాస్, డ్వేన్‌ స్మిత్, ర్యాన్‌ హారిస్,  స్టయిరిస్, ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌ విదేశీ ఆటగాళ్లు కాగా, లక్ష్మణ్, రోహిత్, ప్రజ్ఞాన్‌ ఓజా, ఆర్పీ సింగ్‌ భారత్‌ తరఫున తమ సత్తా చాటినవారు. వై. వేణుగోపాలరావు కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా... దేశవాళీ ఆటగాళ్లు తిరుమలశెట్టి సుమన్, డీబీ రవితేజ, అజహర్‌ బిలాఖియా, షోయబ్‌ అహ్మద్, జస్కరణ్‌ సింగ్, హర్మీత్‌ సింగ్‌లకు టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. 

►మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌: గిల్‌క్రిస్ట్‌ (చార్జర్స్‌–495 పరుగులు, 10 క్యాచ్‌లు+8 స్టంపింగ్‌లు)  
►అత్యధిక పరుగులు (ఆరెంజ్‌ క్యాప్‌): మాథ్యూహేడెన్‌ (చెన్నై–572) 
►అత్యధిక వికెట్లు (పర్పుల్‌ క్యాప్‌): ఆర్పీ సింగ్‌ (దక్కన్‌ చార్జర్స్‌–23)   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top