దక్షిణ కొరియాపై భారత్ జట్టు డేవిస్ కప్ విజయం సాధించడం ఊహించిన ఫలితమే. ఈ పోరులో ప్రధానంగా అందరూ దృష్టి...
దక్షిణ కొరియాపై భారత్ జట్టు డేవిస్ కప్ విజయం సాధించడం ఊహించిన ఫలితమే. ఈ పోరులో ప్రధానంగా అందరూ దృష్టి సారించింది పేస్, బోపన్న జోడీ మీద. గతంలోనూ డేవిస్‌కప్‌లలో పేస్, బోపన్న కలిసి ఆడారు, విజయాలు సాధించారు. కానీ గత నాలుగేళ్లుగా భారత టెన్నిస్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే.. ఈ ఇద్దరూ కలిసి ఏ మేరకు సమన్వయంతో ఆడతారనే సందేహం చాలామందికి ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్‌తో కలిసి ఆడబోనంటూ బోపన్న తేల్చేయడం, ఈసారి రియో ఒలింపిక్స్‌కు ముందు తనకు జోడీగా సాకేత్ మైనేని కావాలని బోపన్న కోరడం లాంటి పరిణామాలు భారత టెన్నిస్‌లో ఆందోళన పెంచాయి.
అయితే భారత టెన్నిస్ సంఘం పట్టుబట్టి మరీ బోపన్నను ఒప్పించి పేస్‌తో కలిపి రియోకి పంపుతోంది. ఒలింపిక్స్‌కు ముందు ఈ ఇద్దరూ కలిసి ఆడటానికి లభించిన చివరి అవకాశం కొరియాతో మ్యాచ్. ఇందులో ఇద్దరూ అంచనాలకు తగ్గట్లుగా రాణించారు. నిజానికి నాణ్యత పరంగా కొరియా జోడీ ఏ మాత్రం భారత జోడీకి పోటీ ఇవ్వదని తెలిసినా... కోర్టులో సమన్వయానికి, ఒకరి ఆటను ఒకరు అర్థం చేసుకోవడానికి లభించిన అవకాశాన్ని పేస్, బోపన్న సద్వినియోగం చేసుకున్నారనే భావించాలి.
పేస్ ఘన చరిత్ర
లియాండర్ పేస్ రియో ఒలింపిక్స్ ద్వారా చరిత్ర సృష్టించబోతున్నాడు. వరుసగా ఏడు ఒలింపిక్స్‌ల్లో పాల్గొనబోతున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు పేస్. అలాగే భారత్ నుంచి ఏ క్రీడలో అయినా ఓ ఆటగాడు ఏడు ఒలింపిక్స్‌ల్లో పాల్గొనడం అద్భుతమైన విషయం. 1992 నుంచి లండన్ ఒలింపిక్స్ వరకు ఆరుసార్లు పాల్గొన్న పేస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో కాంస్యం గెలిచాడు.
1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో జాదవ్ రెజ్లింగ్‌లో పతకం గెలిచిన తర్వాత... మళ్లీ భారత్‌కు వ్యక్తిగత పతకం అందించిన క్రీడాకారుడిగా పేస్ చరిత్ర సృష్టించాడు. ఒక్క ఒలింపిక్స్ అనే కాదు... డేవిస్ కప్‌లలోనూ పేస్‌ది గొప్ప రికార్డు. మామూలు టోర్నీలలో, గ్రాండ్‌స్లామ్‌లలో ఓడిపోయిన మేటి క్రీడాకారుల మీద డేవిస్‌కప్‌లో పేస్ సంచలన విజయాలు సాధించాడు. తనకంటే చాలా మెరుగైన, బలమైన ఆటగాళ్లని ఓడించిన ఘనత పేస్‌ది. భారత జాతీయ జెండా కనిపిస్తూ ఉంటే పేస్‌లోని నైపుణ్యం మరింత బయటకు వస్తుందనేది వాస్తవం. అందుకే భారత క్రీడాచరిత్రలోనే గొప్పవాడిగా పేస్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు.
ఇక బోపన్నకు రియో వరుసగా రెండో ఒలింపిక్స్. లండన్‌లో భూపతితో జోడీగా బరిలోకి దిగినా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి భారత్‌కు టెన్నిస్‌లో డబుల్స్‌లో రియోకు వెళ్లే అవకాశం రావడానికి కారణం బోపన్న. పేస్ వరుసగా ఏడో ఒలింపిక్స్‌లో ఆడుతున్నాడంటే దానికి బోపన్న ర్యాంకింగ్ కారణం. నిజానికి పేస్‌తో కలిసి ఆడే ఏ ఆటగాడైనా కోర్టులోకి దిగితే ఆ దిగ్గజం స్ఫూర్తితో మరింత బాగా ఆడతాడు. రియోలో బోపన్న కూడా అలాగే ఆడతాడని ఆశిద్దాం.
కొరియాపై గెలిచిన తర్వాత పేస్, బోపన్నలతో పాటు భారత బృందం అంతా త్రివర్ణ పతాకంతో టెన్నిస్ కోర్టులో తిరుగుతూ ఉంటే చూసిన ప్రతి భారతీయుడూ గర్వపడ్డాడు. మరో నెల రోజుల్లో రియోలోనూ పేస్, బోపన్న ఇదే త్రివర్ణాన్ని రెపరెపలాడించాలి. అప్పుడే సగటు భారత క్రీడాభిమానికి సంతోషం, సంబరం.
- సాక్షి క్రీడావిభాగం