రషీద్‌ ప్రదర్శనపై వార్నర్‌ ఏమన్నాడంటే!

David Warner Praises Rashid Khan - Sakshi

హైదరాబాద్ : ఐపీఎల్‌-11 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో జరిగిన క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వన్‌ మ్యాన్‌ షోతో అదరగొట్టిన అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ సన్‌రైజర్స్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోను మెరిసి ఔరా అనిపించాడు. రషీద్‌ ప్రదర్శన పట్ల సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ సైతం ఈ యువ సంచలనం ప్రదర్శన పట్ల ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రషీద్ ఫోటోని పోస్ట్ చేసిన వార్నర్.. ఆ ఫొటోకు ‘‘ఇక చెప్పేందుకు ఏమీ లేదు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ గొప్ప ప్రదర్శన. ఈ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక మనం ఫైనల్స్‌కి వచ్చేశాం. ఫైనల్స్‌లో మన జట్టును చూసేందుకు ఎదురుచూస్తున్నా. అది ఒక గొప్ప మ్యాచ్‌ కావాలని ఆశిస్తున్నా..’’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. వార్నర్‌ కామెంట్‌ పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌కు రావాలని, ఆడకపోయిన దగ్గరుండి విజయాన్ని ఆస్వాదించాలని సన్‌ అభిమానులు వార్నర్‌ను కోరుతున్నారు.

కీలక బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో సన్‌రైజర్స్‌ స్వల్ప స్కోర్‌కు పరిమితమవుతుందునుకున్న తరుణంలో రషీద్‌ మెరుపులతో పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాడు. కేవలం 10 బంతుల్లో 4 సిక్స్‌లు,2 ఫోర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్య చేధనలో దిగిన కోల్‌కతా దూకుడుగా ఆరంభించగా.. మరోసారి రషీద్‌ బాధ్యత తీసుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుత ఫీల్డింగ్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కీలక బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణాను పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో రెండు అద్భుత క్యాచ్‌లందుకొని సన్‌రైజర్స్‌కు విజయాన్నందించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top