క్రికెట్‌ ప్రపంచం గళం విప్పాల్సిందే

Darren Sammy Comments About Racism - Sakshi

జాత్యహంకారంపై విండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ

కింగ్‌స్టన్‌: జాత్యహంకారంపై క్రీడా లోకం మండిపడుతోంది. సోమవారం ఫార్ములావన్‌ రేసర్లు గళం విప్పగా... మంగళవారం క్రికెట్, గోల్ఫ్, బాక్సింగ్, ఫుట్‌బాల్‌ వర్గాలు శ్రుతి కలిపాయి. వెస్టిండీస్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ వర్ణ వివక్ష హత్యపై ఘాటుగా స్పందించాడు. గతవారం అమెరికాలో ఓ శ్వేతజాతి పోలీస్‌ అధికారి కర్కశంగా ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఊపిరి తీశాడు. దీన్ని ఫార్ములావన్‌ చాంపియన్‌ హామిల్టన్‌ ఖండించాడు. తాజాగా స్యామీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తో పాటు సభ్యదేశాలన్నీ ఈ దారుణ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ జాత్యహంకారంలో వీళ్లంతా భాగస్వాములేనని భావించాల్సి వస్తుంది’ అని తీవ్ర స్థాయిలో ట్వీట్‌  చేశాడు. ఇది కేవలం అమెరికాకే పరిమి తం కాలేదని, జాతి వివక్ష అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి అని పేర్కొన్నాడు. తను కూడా ఈ వివక్షకు గురైనట్లు డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ చెప్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగక్కర మాట్లాడుతూ పక్షపాతానికి, జాత్యహంకారానికి చోటు లేని సంస్కృతి కోసం మనమంతా కృషి చేయాలన్నాడు. నిజమైన స్వేచ్ఛ, సమానత్వం ఉన్న ప్రపంచాన్ని నిర్మించాలని, అమెరికాలో ప్రస్తు తం ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు మనందరికీ ఓ గుణపాఠం లాంటిదని అన్నాడు.

దిగ్గజ గోల్ఫర్‌ టైగర్‌ వుడ్స్‌ మౌనం వీడి మాట కలిపాడు. ‘నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తాను. శాంతిభద్రతల కోసం సుశిక్షితులైన అధికార్లు ఇలా తమ పరిధిని నిర్దయగా అతిక్రమించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఫ్లాయిడ్‌ హత్య నన్ను కలచివేసింది. అతని కుటుంబసభ్యుల మీదే నా ధ్యాస, సానుభూతి వెళుతోంది’ అని ట్వీట్‌ చేశాడు. బాక్సింగ్‌ లెజెండ్, అజేయ చాంపియన్‌ ఫ్లాయిడ్‌ మేవె దర్‌... జాత్యహంకారానికి బలైన జార్జ్‌ అంతి మ సంస్కారాల్లో పాల్గొంటానని, ఖర్చులు భరిస్తానని చెప్పాడు. దీనికి జార్జ్‌ కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ నెల 9న అతని అంత్యక్రియలు జరుగుతాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) నిరసన గళమెత్తే ఆటగాళ్లను నిరోధించరాదని, మ్యాచ్‌లకు అనుమతించాలని కోరింది. ప్రజల్లో బలమైన ఈ సెంటిమెంటును అణచివేయరాదని కోరింది. జర్మనీలో ఈ వారాంతంలో మ్యాచ్‌లు జరగను న్నాయి. కొందరు ఆటగాళ్లు జార్జ్‌కు న్యాయం చేయాలని నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో ‘ఫిఫా’ ఇలా స్పందించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top