క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో రాజీనామా

Cricket Australia CEO Sutherland Announces Resignation - Sakshi

మెల్‌బోర్న్‌: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్‌లాండ్(52) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు సీఏ బోర్డు, చైర్మన్‌కు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత 17 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సీఈవోగా ఆయన కొనసాగుతున్నారు.

‘సుమారు 20 ఏళ్లుగా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సేవలందిస్తున్నా. గుడ్‌బై చెప్పటానికి ఇదే సరైన సమయం. నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకు, క్రికెట్‌ ఆస్ట్రేలియాకు మంచిదని భావిస్తున్నా’ అంటూ ఈ ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ ఎజెన్సీ(ESA) ద్వారా నూతన సీఈవో నియామకం చేపట్టనున్నట్లు సీఏ ప్రకటించింది. అయితే కొత్తవారిని నియమించే వరకు ఆ పదవిలో కొనసాగాలని సీఏ సదర్‌లాండ్‌కు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.

కాగా, 1998లో సీఏలో సభ్యుడిగా తన ప్రస్థానం కొనసాగించిన జేమ్స్‌ సదర్‌లాండ్‌, 2001 నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో సీఏలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. బోర్డు రెవెన్యూ గణనీయంగా పెరిగిపోయింది. అయితే తర్వాతి కాలంలో అదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. సెలక్షన్‌ కమిటీ నిర్ణయాల్లో ఆయన జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా బిగ్‌ బాష్‌ లీగ్‌ టోర్నీల్లో లాబీయింగ్‌లు చేశారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు ఈ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కుంటున్న జేమ్స్‌ సదర్‌లాండ్‌.. రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top